మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకూ ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తారు. పుట్టినప్పటినుంచి పేరు పెట్టడం, జుట్టు కత్తిరించడం, పెళ్లి, సీమంతం వంటి వేడుకలను ఎంతో సాంప్రదాయబద్దంగా నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలోనే మనిషి చనిపోయిన తర్వాత కూడా అతనికి చేసే దహనసంస్కారాలు కూడా సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. అయితే మనిషి చనిపోయిన తర్వాత వారిని ఎందుకు దహనం చేస్తారు? దహనం చేయడానికి గల కారణం ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
మనిషి బతికి ఉన్నప్పుడు తనకు తెలిసీ తెలియకుండా ఎన్నో పాపాలను చేసి ఉంటాడు. ఈ పాపాలకు పరిహారమే అతను మరణించిన తరువాత అతని దేహాన్ని దహనం చేయడం అని పురాణాలు చెబుతున్నాయి.ఈ విధంగా మనిషి చనిపోయిన తర్వాత దహనం చేయడం వల్ల పాపాలు ఈ జన్మలో పరిహారం కాబడి వచ్చే జన్మలో అయినా పరిశుద్ధుడుగా జన్మిస్తారని భావిస్తారు.
మనిషి చనిపోయిన తర్వాత వారి దహన సంస్కారాలను ఎక్కువగా నదీతీరంలోను లేదా చెరువుల దగ్గర కాలువల దగ్గర నిర్వహిస్తుంటారు. ఈ విధంగా నీటి దగ్గర దహనసంస్కారాలు చేయడం వల్ల వారి ఆత్మ పరిశుద్ధం అవుతుందనే నమ్మకం. మనిషిని కాల్చిన తర్వాత అతని అస్తికలను నీటిలో కలుపుతారు అలా చేయడం వల్ల వారి ఆత్మ ఆ పంచభూతాలతో కలిసిపోతుందని, చివరిగా చనిపోయిన వారికి పిండ ప్రదానం చేయడం వల్ల వారి ఆత్మ సంతృప్తి చెందుతుందని భావిస్తారు.ఈ విధంగా మనిషి చనిపోయినప్పటి నుంచి పిండ ప్రదానం చేసే ఈ మొత్తం ప్రక్రియను అంత్యక్రియలు అని పిలుస్తారు.