ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో అగ్నివీర్ (నాన్ కాంబాటెంట్) ఉద్యోగాల భర్తీకి ఇటీవలే నోటిఫికేషన్‌ను రిలీజ్ చేశారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 24వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ఈ పోస్టులకు గాను దరఖాస్తులను పంపించవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 17 నుంచి 21 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరిలకు చెందిన అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఇంటర్ లేదా డిప్లొమా లేదా 2 ఏళ్ల వొకేషనల్ కోర్సును చదివి ఉండాలి. ఎత్తు 152 సెంటీమీటర్లు ఉండాలి. ఎత్తుకు తగిన బరువు ఉండాలి. 6 నిమిషాల 30 సెకన్లలో 1.6 కిలోమీటర్ల దూరం పరుగెత్తాల్సి ఉంటుంది. 1 నిమిషంలో 10 పుషప్స్ చేయాలి. 1 నిమిషంలో 10 సిటప్స్ చేయాల్సి ఉంటుంది. 1 నిమిషంలో 20 స్క్వాట్స్ చేయాల్సి ఉంటుంది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన పనిలేదు. అభ్యర్థులను రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, స్ట్రీమ్ సూటబిలిటీ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది నెలకు రూ.30వేలు, 2వ ఏడాది నెలకు రూ.33వేలు, 3వ ఏడాది నెలకు రూ.36,500 జీతం చెల్లిస్తారు. 4వ ఏడాది నుంచి నెలకు రూ.40వేల వేతనం ఇస్తారు. 4వ ఏడాది పూర్తి అయిన తరువాత సేవా నిధి ప్యాకేజీ కింద ఎలాంటి పన్ను లేకుండా రూ.10.04 లక్షలను రివార్డు కింద అందిస్తారు.
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌లో ఇచ్చిన చిరునామాకు తమ ధ్రువపత్రాలు, ఇతర పత్రాలను రూ.10 స్టాంపు అతికించిన పోస్టల్ కార్డుతో సహా అప్లికేషన్ ఫామ్‌ను పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్, ఇతర వివరాల కోసం అభ్యర్థులు https://agnipathvayu.cdac.in/AV/img/non-combatant/02-2025/Information_Brochure_Agniveervayu_Non-Combatants_02_2025.pdf అనే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.