సాధారణంగా మన ఇంట్లో ఎవరైనా మరణిస్తే మన పెద్దవారు ఒక సంవత్సరం పాటు ఇంట్లో పూజలు నిర్వహించకూడదని చెబుతుంటారు. ఈ క్రమంలోనే మన ఇంట్లో పూజకు ఉపయోగించే పూజ సామాగ్రిని, దేవుడి ఫోటోలను భద్రంగా ఎత్తి పెడుతున్నాము. అయితే శాస్త్రం ప్రకారం మన ఇంట్లో ఎవరైనా వ్యక్తులు చనిపోతే సంవత్సరం వరకు పూజ చేయకూడదు అనే నియమం ఎక్కడా లేదని చెబుతోంది.
మన ఇంట్లో నిత్యం దీపారాధన చేయటం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు ఉంటాయి.అందుకోసం ప్రతి రోజు ఉదయం సాయంత్రం మన ఇంటిలో దీపారాధన చేయాలని మన పెద్దవారు చెబుతుంటారు. కానీ మన ఇంట్లో మనిషి చనిపోతే ఏకంగా సంవత్సరం పాటు పూజలు చేయకూడదని ఎక్కడా లేదు. కేవలం 11 రోజులు మాత్రమే ఆ ఇంట్లో ఎటువంటి పూజ చేయకుండా ఉండాలని శాస్త్రం చెబుతోంది.
మనిషి చనిపోయిన తర్వాత 11 రోజులకు వారికి చేసే కర్మలను చేసి తర్వాత ఇంటిని శుభ్రం చేసుకుని ఎప్పటిలాగే నిత్యదీపారాధన చేసుకోవచ్చు. అయితే కొత్తగా ఎటువంటి హోమాలు, వ్రతాలు ,పూజలు వంటి వాటిని నిర్వహించకూడదని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.