మనదేశంలో పెన్షన్ అంటే కేవలం వికలాంగులు, వృద్ధులకు మాత్రమే ప్రభుత్వం నుంచి అందే సహకారం అని చెప్పవచ్చు.ఇకపోతే ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ పొందిన ఉద్యోగులకు ప్రభుత్వం పెన్షన్ అందించడం గురించి మనం వినే ఉంటాం. కానీ ఎప్పుడైనా గుర్రాల, కుక్కలకు పెన్షన్ అందించడం గురించి విన్నారా? వినడానికి ఎంతో ఆశ్చర్యంగా ఉన్నా పోలాండ్ దేశంలో ప్రభుత్వ విధులలో సహకరించిన గుర్రాలకు, శునకాలకు పెన్షన్ ఇవ్వబోతోంది. ప్రభుత్వ విధుల్లో అధికారులకు సహకరించిన జంతువులకు అధికార హోదా ఇచ్చి, పదవీ విరమణ తర్వాత పెన్షన్ సౌకర్యం కల్పించే ఆలోచనలో పోలాండ్ ప్రభుత్వం ఉంది.
పోలాండ్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి తమ లెజిస్లేషన్ ముందు త్వరలో ఈ బిల్లుని ప్రవేశపెట్టాలని అనుకుంటున్నారు. ఈ బిల్లు చట్టపరంగా రూపుదిద్దుకుంటే ప్రస్తుతం ప్రభుత్వ విధులలో సేవలందిస్తున్న 1200 శునకాలకు, 60 కి పైగా గుర్రాలకు రిటైర్మెంట్ బెనిఫిట్ అందుతుంది.ఈ విధంగా జంతువులు విధినిర్వహణలో ఉన్నప్పుడు వాటి పని ఎంతో కష్టంతో కూడుకొని ఉంటుంది. ప్రతి ఏడాది పది శాతానికి పైగా జంతువులు పదవీ విరమణ పొందుతాయి. విధులు నిర్వహిస్తున్న సమయంలో వాటి పని ఎంతో కష్టంతో ఉండటం వల్ల పదవీ విరమణ తర్వాత వాటికి చికిత్స ఎంతో అవసరం.
పోలాండ్ లో పదవీ విరమణ పొందిన జంతువుల కోసం ప్రత్యేకంగా “ది వెటరన్స్ కార్నర్” అనే ఒక్క షెల్టర్ హోమ్ ఉంది. స్లవోమీర్ వాల్కోవియక్ అనే 50 ఏళ్ల రిటైర్డ్ పోలీస్ దీనిని నడుపుతున్నారు. నెల నెలా వీటి ఆహారానికి, చికిత్సకు వేలాది డాలర్లు ఖర్చు చేసినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదు. కనుక పదవీ విరమణ తర్వాత వీటి బాధ్యతలను చూసుకోవడం కోసం వీటికి ప్రభుత్వం పెన్షన్ ను అందించడం బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు.ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాత ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఏకగ్రీవంగా ఆమోదించాల్సిన అవసరం ఉందని పోలాండ్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి తెలియజేశారు.