ముంబైలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 టోర్నీ 15వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. చెన్నై నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని కోల్‌కతా నైట్ రైడర్స్ ఓ దశలో ఛేదించేటట్లే కనబడింది. కానీ ఎప్పటికప్పుడు వికెట్లను కోల్పోతూ వచ్చింది. దీంతో కోల్‌కతాపై చెన్నై 18 పరుగుల తేడాతో గెలుపొందింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా చెన్నై బ్యాటింగ్ చేపట్టింది. ఈ క్రమంలో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. చెన్నై బ్యాట్స్‌మెన్లలో డుప్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్‌లు అద్భుతంగా రాణించారు. 60 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో డుప్లెసిస్ 95 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా 42 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో రుతురాజ్ గైక్వాడ్ 64 పరుగులు చేశాడు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, ఆండ్రు రస్సెల్‌లకు తలా 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేపట్టిన కోల్‌కతా 19.1 ఓవర్లలో ఆలౌట్ అయింది. 202 పరుగులు మాత్రమే చేసింది. కోల్‌కతా బ్యాట్స్‌మెన్లలో ప్యాట్ కమ్మిన్స్ 34 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 66 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆండ్రు రస్సెల్ 22 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 54 పరుగులు చేయగా, దినేష్ కార్తీక్ 24 బంతల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 పరుగులు చేశాడు. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్ 4 వికెట్లు, లుంగి ఎంగిడిలు 3 వికెట్లు పడగొట్టారు. శామ్ కుర్రాన్‌కు 1 వికెట్ దక్కింది.