కరోనా నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో బుధవారం నుంచి 10 రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ సమావేశంలో మంత్రులతో చర్చించి సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో తెలంగాణలో రేపటి నుంచి లాక్‌డౌన్ అమలు కానుంది.
లాక్‌డౌన్‌లో భాగంగా ఉదయం 6 నుంచి 10 గంటల వరకు నిత్యావసరాలను కొనేందుకు అనుమతులు ఇస్తారు. ఆ సమయంలో లాక్‌డౌన్ సడలింపులు ఉంటాయి. ఉదయం 10 గంటలు దాటితే పూర్తి స్థాయిలో లాక్‌డౌన్ అమలులో ఉంటుంది. అయితే అత్యవసర సేవలు, మీడియా వంటి వారికి లాక్‌డౌన్ నుంచి మినహాయింపులు ఉంటాయి.
కాగా రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు ఎప్పటికప్పుడు విచారిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే మంగళవారం ఉదయం కూడా ఈ అంశంపై కోర్టులో వాదనలు జరిగాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు మళ్లీ అక్షింతలు వేసింది. లాక్‌డౌన్ విధించే అంశాన్ని పరిశీలించాలని చెప్పినా ఎందుకు పట్టించుకోలేదని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఆంబులెన్స్‌లను ఎందుకు ఆపుతున్నారు, మానవత్వం లేదా అని, ఆంబులెన్స్ చార్జిలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పామని, దానిపై ఏం నిర్ణయం తీసుకున్నారని, కుంభమేళా నుంచి వచ్చిన వారిని గుర్తించారా, లేదా ? అని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నల వర్షంతో ముప్పు తిప్పలు పెట్టింది. ఇక మధ్యాహ్నం అనంతరం కోర్టు విచారణ మళ్లీ ప్రారంభం కానుంది.