NTR : గత పది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోని కడప, చిత్తూరు జిల్లాలో కురిసిన అధిక వర్షాల కారణంగా ఎన్నో గ్రామాలు చెరువులను తలపించాయి. అధిక వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వాగులు, వంకలు పొంగి పొర్లడంతో గ్రామాలన్నీ జలమయమయ్యాయి. ఈ క్రమంలోనే కొన్ని రోజుల పాటు జనజీవనం స్తంభించిపోయింది. అదే విధంగా ఎంతో మంది నిరాశ్రయులుగా మారిపోయారు. ఎంతో మంది రైతులు చేతికొచ్చిన పంట నీటిలో కొట్టుకుపోతుంటే చూసి కన్నీటి పర్యంతమయ్యారు.
ఇలా అకాల వర్షాల కారణంగా ఎంతో నష్టపోయిన వారి కోసం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున వరద బాధితుల కోసం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇదిలా ఉండగా తాజాగా వరద బాధితులను చూసి చలించిపోయిన ఎన్టీఆర్ తన వంతు సహాయంగా వరద బాధితుల కోసం 25 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు.

ఈ క్రమంలోనే వరద బాధితుల కోసం తాను అండగా నిలిచినట్లు.. వరద బాధితుల కోసం 25 లక్షల రూపాయలను విరాళంగా అందించిన విషయాన్ని తారక్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక తారక్ సినిమాల విషయానికొస్తే ఆయన నటించిన RRR సినిమా జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.