Isha Koppikar : సినిమా పరిశ్రమలో మహిళలపై జరిగే వేధింపుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాస్టింగ్ కౌచ్ అంటూ ఇటీవల చాలా మంది నటీమణులు తమ జీవితంలో జరిగిన విషయాలపై నోరు విప్పుతున్నారు. క్యాస్టింగ్ కౌచ్ వల్ల సినిమా అవకాశాలు చాలా పోగొట్టుకున్నామని చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో చేరింది చంద్రలేఖ సినిమా హీరోయిన్ ఇషా కొప్పికర్. తాజాగా బాలీవుడ్ హంగామాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ దీనికి సంబంధించిన మరిన్ని విషయాలను వెల్లడించింది.

90వ దశకం చివర్లో కెరీర్ ప్రారంభించిన బ్యూటీ ఇషా కొప్పికర్ నాగార్జున చంద్రలేఖ, వెంకటేష్ ప్రేమతో రా లాంటి చిత్రాల్లో మెరిసింది. ప్రస్తుతం ఆమె వయసు 45 ఏళ్ళు. ఇప్పటికీ ఈ అమ్మడు తన అందచందాలతో నెటిజన్స్ మనసులను దోచుకుంటూనే ఉంటుంది. అయితే తాజాగా తన లైఫ్‌లో జరిగిన కొన్ని షాకింగ్ విషయాలను తెలియజేసింది. యాక్టర్స్‌గా ఎలా కనిపిస్తున్నాము ? ఎలా నటిస్తున్నామనేదే ముఖ్యమనుకున్నాను. కానీ కొందరు హీరోల కంట్లో కూడా ఉంటామని తర్వాత తెలిసింది. ఆ రోజు జరిగిన సంఘటనతో నా హృదయం ముక్కలైంది.. అని తెలిపింది.
నాకు నా వర్క్ కంటే జీవితమే ముఖ్యమైనది. అద్దంలో నన్ను నేను చూసుకున్నప్పుడు తలెత్తుకునేలా ఉండాలని పేర్కొంది. ఓ నిర్మాత ఫోన్ చేసి ఓ హీరో రాసుకున్న లిస్టులో మీరు కూడా ఉన్నారని చెప్పాడు. నాకర్థం కాక హీరోకు ఫోన్ చేస్తే అతడు ఒంటరిగా రమ్మన్నాడు. స్టాఫ్‌ని కూడా తీసుకురావొద్దని చెప్పడంతో నాకు విషయం అర్ధమైంది. అప్పుడు ఆ నిర్మాతను పిలిచి కడిగిపడేశాను. నా అందం, పనితనం వల్లే ఇక్కడిదాకా వచ్చాను, అలాంటిది ఓ అవకాశం కోసం దిగజారతానని ఎలా అనుకున్నారు.. అంటూ లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ పీకాను. దీంతో అతడు నన్ను సినిమా నుంచి తప్పించాడు.. అని చెప్పుకొచ్చింది ఇషా. కాగా ఈమె కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అయితే ఆమెకు ఎదురైన అనుభవం తెలుగు ఇండస్ట్రీలోనా.. బాలీవుడ్‌లోనా.. అన్న విషయం చెప్పలేదు.