Rajamouli : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఇందులో ఎన్‌టీఆర్ భీమ్ పాత్రలో అలరించగా.. చరణ్ అల్లూరి పాత్రలో ఒదిగిపోయాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం చిత్ర యూనిట్ సక్సెస్ జోష్ ను ఎంజాయ్ చేస్తోంది. ఇక ఓ వైపు చరణ్ అయ్యప్ప దీక్ష చేపట్టగా.. ఎన్‌టీఆర్ హనుమాన్ మాల ధరించారు. అయితే దర్శకుడు రాజమౌళి ఇక ఏం చేయబోతున్నారు ? అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అప్పట్లో బాహుబలి 2 అనంతరం తక్షణమే ఆర్ఆర్ఆర్ ను ప్రకటించి జక్కన్న అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చారు. అయితే తన తదుపరి సినిమా మహేష్ బాబుతో ఉంటుందని ముందే ప్రకటించారు. దీంతో ఆ అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

అయితే సినిమా మాటేమోగానీ రాజమౌళి మాత్రం ప్రస్తుతం కొత్త కారు కొన్నారు. అది వోల్వో కంపెనీకి చెందినది. వోల్వో ఎక్స్‌సీ 40 మోడల్ కారును ఆయన తాజాగా కొనుగోలు చేశారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫొటోను బట్టి చూస్తే షోరూం వారు నేరుగా ఆయన ఇంటికే కారును డెలివరీ చేసినట్లు అర్థమవుతోంది. అయితే జక్కన్న వద్ద ఇప్పటికే మెర్సిడెస్ కంపెనీకి చెందిన కార్లు ఉన్నాయి. బాహుబలికి ముందు ఆయన సాధారణ మారుతి స్విఫ్ట్‌లో తిరిగారు. కానీ బాహుబలి తరువాతే ఆయన లగ్జరీ కార్లను వాడడం మొదలు పెట్టారు. అలా ఆయన బెంజ్ కార్లలో తిరిగారు. ఇక ఇప్పుడు వోల్వో కారును కొనుగోలు చేశారు.
ఇక వోల్వో ఎక్స్‌సీ 40 మోడల్ కారు ఎక్స్ షోరూం ధర ప్రస్తుతం రూ.44.50 లక్షలుగా ఉంది. ఇది ప్రారంభ ధరనే. ఇందులో టాప్ ఎండ్ మోడల్ కారు ధర ఇంకా ఎక్కువగానే ఉంటుంది. ఇక ఈ కారు ప్రత్యేకతలు ఏమిటంటే.. ఇందులో 1969 సిసి ఇంజిన్ ఉంది. ఇది 187 బీహెచ్‌పీని అందిస్తుంది. ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ ఇందులో అందుబాటులో ఉంది. 5 మంది సులభంగా కూర్చోవచ్చు. ట్రాఫిక్‌లోనూ ఎలాంటి ఇబ్బంది లేకుండా సులభంగా ప్రయాణించేలా దీన్ని డిజైన్ చేశారు. ఇక ఇందులో ఎయిర్ బ్యాగ్స్, ఇతర సేఫ్టీ ఫీచర్లను కూడా ఎక్కువగానే అందిస్తున్నారు.
కాగా రాజమౌళి త్వరలోనే ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్లనున్నారని తెలుస్తోంది. తిరిగి ఇండియాకు వచ్చాక మహేష్ బాబుతో చేయనున్న సినిమా స్టోరీని ఓకే చేస్తారట. అందుకు గాను తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో కలిసి ఆయన పనిచేయనున్నారు. ఆ తరువాత అన్నీ సిద్ధం చేసి సినిమా షూటింగ్ ప్రారంభిస్తారు. ఇక అప్పటిలోగా మహేష్.. త్రివిక్రమ్‌తో చేయనున్న సినిమాను త్వరగా కంప్లీట్ చేస్తారని తెలుస్తోంది. దాని తరువాతే రాజమౌళి సినిమా ప్రారంభం అవుతుంది.