IPL 2021 : షార్జా వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ 2021 టోర్నీ 44వ మ్యాచ్‌లో చెన్నై విజయం సాధించింది. హైదరాబాద్ నిర్దేశించిన స్వల్ప పరుగుల లక్ష్యాన్ని చెన్నై కష్టపడుతూ సాధించింది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌పై చెన్నై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.

మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై ముందుగా ఫీల్డింగ్‌ను ఎంచుకుంది. ఈ క్రమంలోనే తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ తడబడింది. ఫలితంగా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి హైదరాబాద్ 134 పరుగులను మాత్రమే చేయగలిగింది. వృద్ధిమాన్ సాహా 46 బంతుల్లో 44 పరుగులు చేసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ మిగిలిన ఎవరూ రాణించలేకపోయారు. ఇక చెన్నై బౌలర్లలో హేజల్‌వుడ్ 3 వికెట్లు పడగొట్టగా, బ్రేవో 2 వికెట్లు తీశాడు. శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజాలకు చెరో వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై స్వల్ప పరుగుల లక్ష్యమే అయినప్పటికీ ఆచి తూచి ఆడింది. దీంతో ఆ జట్టు 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. 4 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. చెన్నై బ్యాట్స్‌మెన్‌లలో రుతురాజ్ గైక్వాడ్ 38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 45 పరుగులు చేసి ఆకట్టుకోగా, మరో బ్యాట్స్‌మన్ ఫఫ్ డుప్లెసిస్ 36 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 41 పరుగులు చేసి రాణించాడు. ఇక మిగిలిన ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేదు. హైదరాబాద్ బౌలర్లలో జేసన్ హోల్డర్ 3 వికెట్లు పడగొట్టగా, రషీద్ ఖాన్ 1 వికెట్ తీశాడు.