మనకు కష్టం వస్తే తల్లి ఒడిలో తల పెట్టుకుని పడుకుంటాం. తల్లి ప్రేమ మనకు సాంత్వనను అందిస్తుంది. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఎంత కష్టం ఉన్నా, సమస్య వచ్చినా తల్లి లాలిస్తే ఊరట చెందుతాం. అయితే భారతీయ సంప్రదాయాల ప్రకారం ఆవుల వద్ద కూడా సరిగ్గా అలాంటి సాంత్వనే లభిస్తుంది. ముఖ్యంగా తల్లి ఆవులు చాలా ప్రశాంతంగా ఉంటాయి. వాటి వద్ద కొంత సేపు ఉంటే మనస్సు ప్రశాంతంగా మారుతుంది. అందుకనే పాశ్చాత్య దేశాల్లో ఇప్పుడు ఆవు వద్ద గడపడం, ఆవులను కౌగిలించుకోవడం ఎక్కువయ్యాయి. దీన్నే కౌ కడ్లింగ్ (Cow Cuddling) అని పిలుస్తున్నారు.
అమెరికాలోని అరిజోనాతోపాటు పలు ఇతర రాష్ట్రాల్లోనూ కౌ కడ్లింగ్‌కు ఆదరణ పెరుగుతోంది. ఆవు వద్ద గడిపేందుకు, ఆవును కౌగిలించుకునేందుకు గంటకు 75 నుంచి 200 డాలర్ల వరకు (దాదాపుగా రూ.14వేలు) చెల్లిస్తున్నారు. అమెరికాతోపాటు యూఎస్ఏ, నెదర్లాండ్, స్విట్జర్లాండ్, యూకేలలో ఇప్పుడు కౌ కడ్లింగ్ విస్తరిస్తోంది. చాలా మంది ఆవుల వద్ద గడిపేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు.
కౌ కడ్లింగ్ వల్ల శ్వాసకోశ వ్యాధులు, హైబీపీ, వెన్ను నొప్పి, గుండె సమస్యలు, విచారం, ఆందోళన తదితర సమస్యలు తగ్గుతాయని చెబుతున్నారు. దీంతోపాటు మానసిక ప్రశాంతత లభిస్తుంది, ఒత్తిడి తగ్గుతుందని చెబుతున్నారు. అందువల్లే కౌ కడ్లింగ్ కు ఇప్పుడు అంతటా ఆదరణ పెరుగుతోంది.