ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో మనకు తెలిసిందే. కేవలం సాధారణ దగ్గు జలుబు ఉన్నా కూడా ప్రవేట్ ఆసుపత్రులకు వెళితే కరోనా పేరు చెప్పి వైద్యపరీక్షల కోసం వేలల్లో డబ్బులు లాగుతున్నారు. అలాంటిది కరోనా వైరస్ సోకితే వారికి వైద్యం చేయించడానికి లక్షల రూపాయలను ప్రజల నుంచి వసూలు చేస్తున్న ఈ రోజుల్లో కేవలం పది రూపాయల ఫీజుతోనే కరోనా వైద్యానికి చికిత్స అందిస్తూ పేదల పాలిట దేవుడయ్యాడు.
పీర్జాదిగూడలో ప్రజ్వల క్లినిక్ నిర్వహిస్తున్న డాక్టర్ విక్టర్ ఇమ్మాన్యుయెల్ ఆదర్శమిది.జనరల్ మెడిసిన్ లో స్పెషలైజేషన్‌తో ఎంబీబీఎస్ చేసిన డాక్టర్ ఇమ్మాన్యుయేల్ వివిధ ఆస్పత్రులలో విధులు నిర్వహించి ప్రస్తుతం సొంతంగా ఒక క్లినిక్ నడుపుతున్నాడు. ఈ క్లినిక్ ప్రారంభించినప్పటి నుంచి డాక్టర్ విక్టర్ 200 రూపాయలు కన్సల్టేషన్ ఫీజు తీసుకునేవాడు. అయితే ఈ కరోనా విపత్కర పరిస్థితులలో ప్రతి ఒక్కరికి మంచి వైద్యం అందించాలన్న ఆరాటంలో కేవలం 10 రూపాయలకే కరోనా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
పది రూపాయల కన్సల్టేషన్ ఫీజు తీసుకొని కరోనా వైద్య పరీక్షలు, మందులు వంటి సౌకర్యాలను అందిస్తున్నారు. ఇక నిరుపేదలకు, దేశ రక్షణ కోసం పాటుపడే సైనికులకు, దేశానికి అన్నం పెట్టే రైతులకు ఉచితంగానే ఈ చికిత్సను అందిస్తున్నారు. కరోనా బారిన పడి ఆక్సిజన్ అవసరమయ్యే వారికి రెమ్‌డెవివిర్ వంటి ఇంజెక్షన్లను ఉపయోగించి ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రస్తుతం లక్షలలో డబ్బులు వసూలు చేస్తున్నారు. కానీ ఈ ఆస్పత్రిలో మాత్రం కేవలం 15 నుంచి 20 వేల రూపాయలతో మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్ తెలిపారు.
కరోనా బారిన పడి ఇంటి దగ్గరే వైద్యసేవలు తీసుకుంటున్న వారి కోసం తమ ఆసుపత్రి నుంచి ఇంటికి నర్సులను పంపుతూ చికిత్సనందిస్తున్నారు. అయితే నర్సుల రవాణా చార్జీలను రోగులు భరించాల్సి ఉంటుంది. బయట ఆస్పత్రులలో లక్షలు వసూలు చేసి అందిస్తున్న చికిత్సను డాక్టర్ ఇమ్మానియేల్ 20వేల రూపాయలు అందించడంతో ప్రజలు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకుంటున్నారు. ఇలాంటి కష్ట సమయాల లో డాక్టర్ ఉదారస్వభావంతో ఈ విధంగా వైద్యసేవలు అందించడం పట్ల డాక్టర్ ఇమ్మానియేల్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.