కరోనా సెకండ్ వేవ్ ప్రభావం వల్ల భారత్‌లో రోజుకు 3 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. మే నెలలో రోజుకు 10 లక్షల కేసులు నమోదు అయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరో వైపు అనేక రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా హాస్పిటళ్లలో బెడ్లు నిండిపోయాయి. ఒక రోగి బెడ్‌ను ఖాళీ చేస్తేగానీ ఇంకో రోగికి బెడ్ దొరకని పరిస్థితి నెలకొంది. ఇక ఇతర వైద్య సదుపాయాలు కూడా మృగ్యమయ్యాయి. దీంతో ఇతర దేశాలు భారత్‌కు సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి.
కాగా పాకిస్థాన్‌లోని కరాచీకి చెందిన అబ్దుల్ సత్తార్ ఎధి ఫౌండేషన్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది. తాము పాకిస్థాన్‌లో 1800 ఆంబులెన్స్‌ల ద్వారా వైద్య సేవలను అందిస్తున్నామని, భారత్ అనుమతిస్తే వాటిల్లోంచి 50 ఆంబులెన్స్‌లను భారత్‌కు పంపుతామని, వాటితోపాటు సిబ్బంది కూడా వస్తారని ఆ ట్రస్టు తెలిపింది. ఈ మేరకు ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ ఫైసల్ ఎధి మీడియాకు తెలిపారు.
భారత్‌లో కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉందని ఫైసల్ ఎధి అన్నారు. కరోనా సెకండ్ వేవ్ వల్ల భారత్ విలవిలలాడుతుందని, కానీ పాకిస్థాన్‌లో కోవిడ్ ఉధృతి అంతగా లేదని, కనుక తాము తమ ఆంబులెన్స్‌లను భారత్‌కు పంపేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే దీనిపై కేంద్రం స్పందించాల్సి ఉంది.