ప్రస్తుతం కరోనా కష్టకాలం నడుస్తోంది. అంతా బాగానే ఉందనుకుంటున్న నేపథ్యంలో కరోనా ఒమిక్రాన్ రూపంలో విలయ తాండవం చేసేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే ఇప్పటికీ ఇంకా నష్టాల్లోనే ఉన్న అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ కంపెనీకి చెందిన సీఈవో ఒకే ఒక్క కాల్‌తో ఏకంగా 900 మంది ఉద్యోగులను తమ కంపెనీ నుంచి తీసేశాడు. వివరాల్లోకి వెళితే..
అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న బెటర్ డాట్ కామ్ అనే కంపెనీకి భారత సంతతికి చెందిన విశాల్ గార్గ్ సీఈవోగా పనిచేస్తున్నాడు. అయితే ఇది వరకే కొంత మందిని పెద్ద ఎత్తున ఈయన తీసేశాడు. తాజాగా మరో 900 మందిని తీసేస్తున్నట్లు తెలిపాడు. ఈ క్రమంలోనే అంత మందితోనూ ఒకే ఒక్క జూమ్ వీడియో కాల్ లో మాట్లాడి.. వాళ్లను తీసేస్తున్నట్లు అప్పటికప్పుడే తెలిపాడు.
కంపెనీ నష్టాల్లో ఉందని, అందువల్ల ప్రదర్శన సరిగ్గా లేని ఉద్యోగులను తీసేయక తప్పడం లేదని, ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నానని, ఇలా ఉద్యోగులను తీసేయడం ఇది రెండోసారని, తనకు ఈ విధంగా చేయడం నచ్చడం లేదని, అయినప్పటికీ తీసేయక తప్పడం లేదని తెలిపాడు. నాతో కాల్‌లో ఉన్న మీ 900 మంది ఉద్యోగులు దురదృష్టవంతులు అని అన్నాడు. ఈ క్రమంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా.. కొందరు ఆ సీఈవోను విమర్శిస్తున్నారు.
ఉద్యోగులను తీసేయడం కరెక్టే కానీ.. మరీ ఇలా ఉన్నపళంగా తీసేస్తే ఎలా ? అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఆ కంపెనీ ఉద్యోగులను తీసేసినప్పటికీ 2 నెలల జీతం, ఇతర బెనిఫిట్స్‌ను అందిస్తున్నట్లు తెలిపింది.