కరోనా ఉందని, జాగ్రత్తలు పాటించాలని, లేదంటే వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని ఎంత చెప్పినా కొందరు వినడం లేదు. బహిరంగ ప్రదేశాల్లో కోవిడ్ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. పైగా కొందరు మరీ అతి చేస్తున్నారు. మాకు కోవిడ్ ఉంది, మేం ఇలాగే చేస్తాం.. ఎవరాపుతారో చూస్తాం.. అంటూ వెకిలిగా ప్రవర్తిస్తున్నారు. అయితే ఓ మహిళ కూడా ఇలాగే ప్రవర్తించింది. చివరకు జైలు పాలైంది. వివరాల్లోకి వెళితే..
పెన్సిల్వేనియాలో ఉన్న గెరిటీస్ అనే సూపర్ మార్కెట్‌కు మార్గరెట్ అన్ సర్కో అనే మహిళ వచ్చింది. అయితే ఆమె ఆ సూపర్ మార్కెట్‌లోని ఆహారాలన్నింటిపైనా దగ్గుతూ ఉమ్మి వేసింది. దీంతో స్టోర్ వారికి 35వేల డాలర్ల (దాదాపుగా రూ.25 లక్షల) నష్టం వచ్చింది. అయితే ఆమెను వెంటనే సూపర్ మార్కెట్‌లోని సెక్యూరిటీ గార్డులు బయటకు తోసేశారు. తరువాత పోలీసులకు అప్పగించారు.
ఆమె అలా ఆ పనిచేసినప్పుడు తనకు కోవిడ్ ఉందని కూడా చెప్పింది. అయితే తరువాత ఆమెకు టెస్టులు చేయగా కోవిడ్ నెగెటివ్ అని తేలింది. అయినప్పటికీ ఆమె చేసింది తప్పే కనుక కోర్టులో హాజరు పరిచారు.
ఈ సంఘటన గతేడాది మార్చిలో జరగ్గా ఇప్పటికి విచారణ పూర్తయింది. దీంతో ఆ మహిళ ఎట్టకేలకు తాను తప్పు చేశానని, ఆ సమయంలో మద్యం సేవించి ఉన్నానని, అందుకే అలా ప్రవర్తించానని, తనను క్షమించాలని న్యాయమూర్తిని వేడుకుంది. దీంతో న్యాయమూర్తి ఆమెకు 2 ఏళ్ల జైలు శిక్షతో సరిపెట్టారు. అలాగే సూపర్ మార్కెట్‌కు 30వేల డాలర్ల నష్ట పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చారు. అవును మరి.. బహిరంగ ప్రదేశాల్లో అలా వెకిలిగా, అనుచితంగా ప్రవర్తిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు మరి.