పెట్రోల్, డీజిల్ వాహనాల వాడకాన్ని తగ్గించేందుకు కేంద్రం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తోంది. అందుకనే ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే వారికి సబ్సీడీలను కూడా అందిస్తోంది. అయితే వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసి అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎనర్జీ స్టోరేజీ సొల్యూషన్స్ ప్రొవైడర్ ఓకాయా గ్రూప్ ఎలక్ట్రిక్ టూ వీలర్ రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు తెలిపింది.
ఈ సంస్థ ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ లో ద్విచక్ర వాహనాల తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది. రాజస్థాన్ లోని నీమ్రానా ప్రాంతంలో 2023 – 25 నాటికి ఇంకో ఫ్యాక్టరీని ప్రారంభించనుంది. భారతీయ పరిస్థితులకు అనుగుణంగా ఎలక్ట్రిక్ బైక్ లను తయారు చేస్తామని ఆ సంస్థ తెలిపింది. అవియోనిక్ సిరీస్, క్లాస్ ఐక్యూ సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో అధునాతమైన టెక్నాలజీని ఉపయోగిస్తామని ఆ కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
కాగా ఈ కంపెనీ విడుదల చేయనున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.39,999 నుంచి రూ.60,000 వరకు ఉండనుంది. అంటే అత్యంత చవక ధరకు స్కూటర్లను అందిస్తున్నమాట. 2025 నాటికి భారతీయ రోడ్లపై 1 కోటి ఇ-స్కూటర్లను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దానికి తాము ఊతం ఇస్తామని ఓకాయా తెలిపింది. ఈ మేరకు ఓకాయా పవర్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ గుప్తా పై వివరాలను వెల్లడించారు. అయితే సదరు స్కూటర్లు ఎప్పుడు అందుబాటులోకి వచ్చేది వెల్లడించలేదు. కానీ అతి త్వరలోనే లాంచ్ చేస్తారని తెలుస్తోంది.