కరోనా ప్రభావం వల్ల ఎంతో మంది ఉద్యోగాలను, ఉపాధిని కోల్పోయారు. ఈ క్రమంలో వారు మళ్లీ ఉపాధి పొందడం కష్టంగా మారింది. అయితే అలాంటి స్థితిలో ఉన్నప్పటికీ ఆ మహిళ చాలా తెలివిగా ఆలోచించింది. కరోనా వల్ల అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతోంది. కనుక తాను కూడా ఆన్‌లైన్‌లోనే బిజినెస్ చేయాలనుకుంది. వెంటనే ఆ ఆలోచనను అమలు చేసింది.
రాజస్థాన్‌లోని అమరావతి అనే ప్రాంతానికి చెందిన భావన మనోజ్ దేశ్వానిది బోటిక్ బిజినెస్. కుటుంబంలో అందరూ కలసి కట్టుగా ఆ వ్యాపారం చేస్తారు. అందరూ పనిచేస్తారు. ఇక భావన చక్కని ఎంబ్రాయిడరీ డిజైన్లు చేస్తుంది. అయితే కోవిడ్ వల్ల లాక్‌డౌన్‌లను అమలు చేస్తుండడంతో వారి వ్యాపారం బాగా డౌన్ అయింది. తీవ్రమైన నష్టాలు వచ్చాయి. కానీ భావన ఆలోచనతో వారు మల్లీ విజయవంతంగా వ్యాపారం చేయడం మొదలు పెట్టారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాను ఓపెన్ చేసి అందులో తమ ఫ్యాషన్ ఉత్పత్తులను విక్రయించడం ప్రారంభించింది.
మొదట్లో అందులో మాస్కులను తయారు చేసి అమ్మేవారు. అవి చక్కని డిజైన్లలో ఉండడంతో మంచి ఆదరణ లభించింది. దీంతో వారు మాస్కులతోపాటు హెయిర్ యాక్ససరీలు, దుస్తులు, డ్రెస్సులు, కుర్తీలు, చిన్నారుల దుస్తులు తదితర ఫ్యాషన్ ఉత్పత్తులను కుట్టి, వాటికి చక్కని డిజైన్లు చేసి అమ్మడం మొదలు పెట్టారు. క్రమంగా వారు ప్రగతిని సాధించారు.
భావన కుటంబం ఇప్పుడు నెలకు రూ.80వేల వరకు సంపాదిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారానే ఇకపై ఉత్పత్తులను అమ్ముతామని చెబుతోంది. ఓ కొరియర్ సంస్థతో ఆమె ఒప్పందం చేసుకుంది. దీంతో వారు తమ ఉత్పత్తులను దేశం మొత్తం ఎక్కడికైనా సరే డెలివరీ చేస్తున్నారు. అలా వారు కొద్ది నెలల్లోనే సక్సెస్ సాధించారు. తీవ్రమైన సమస్యలతో సతమతం అవుతున్నవారు, స్వయం ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయిన వారు ఈ విధంగా భావన లాగా ప్రయత్నిస్తే ఏదో ఒక ఉపాధి పొంది ఆర్థిక సమస్యల నుంచి బయట పడవచ్చు.