డిమార్ట్ సూపర్ మార్కెట్‌ల గురించి తెలుసు కదా. బయట మార్కెట్ కన్నా తక్కువ ధరలకే వస్తువులను విక్రయిస్తారని వాటికి పేరుంది. ఆ సూపర్ మార్కెట్‌ల యజమాని రాధాకృష్ణన్ దమాని. అవెన్యూ సూపర్ మార్ట్స్ లిమిటెడ్ సంస్థ ద్వారా ఆయన డిమార్ట్ సూపర్ మార్కెట్‌లతో వ్యాపారం చేస్తున్నారు. అయితే ఆయన తాజాగా ముంబైలోని అత్యంత పాష్ ఏరియాలో భారీ మొత్తం వెచ్చించి ఓ ఇంటిని కొనుగోలు చేశారు.
ముంబైలోని మలబార్ హిల్ ఏరియాలో రాధాకృష్ణ దమాని ఏకంగా రూ.1000 కోట్లు పెట్టి ఇల్లు కొన్నారు. దాని విస్తీర్ణం 5,752.22 చదరపు అడుగులు. పూరాచంద్, పరేష్‌చంద్, రాయ్‌చంద్, ప్రేమ్ చంద్ అనే వ్యక్తుల నుంచి ఆయన ఆ ఇంటిని కొన్నారు. మార్చి 31వ తేదీన ఆయన ఆ ఇంటిని కొనగా కేవలం స్టాంపు డ్యూటీకే రూ.30 కోట్లు చెల్లించారు.
కాగా కరోనా సమయంలో రాధాకృష్ణన్ ఆస్తులు అమాంతం పెరిగాయి. 2020 ఫోర్బ్స్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం ఆయన దేశంలో సంపన్నుల జాబితాలో 4వ స్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తి విలువ సుమారుగా 15.4 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా.
ముంబైలో కరోనా వల్ల గతేడాది రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయినప్పటికీ ఇటీవలి కాలంలో ఆ రంగం 112 శాతం వృద్ధి రేటును సాధించింది. రియల్ ఎస్టేట్ అక్కడ మళ్లీ పుంజుకుంటోంది. అయితే 2015లో పూనావాలా గ్రూప్ చైర్మన్ సైరస్ పూనావాలా అక్కడ ఉన్న లింకన్ హౌజ్‌ను ఏకంగా రూ.750 కోట్లు పెట్టి కొనడం విశేషం.