దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు పెరుగుతున్నప్పటికీ, ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 కొనసాగుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ఐపీఎల్ జరుగుతుందన్నారు. కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టడానికి మహారాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేయాలని నిర్ణయించిన తరువాత గంగూలీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ 2021 కొనసాగుతుందని గంగూలీ మీడియాకు చెప్పారు. మహారాష్ట్రలో గత శుక్రవారం రాత్రి 8 నుండి సోమవారం ఉదయం 7 గంటల వరకు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆ రాష్ట్ర కేబినెట్ మంత్రి నవాబ్ మాలిక్ ఆదివారం కేబినెట్ సమావేశంలో మరిన్ని నిర్ణయాలు తీసుకున్నారు.
కాగా మహారాష్ట్రలో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా రాత్రి 8 నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. వారాంతాల్లో లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. పగటిపూట 144 సెక్షన్‌ను విధించారు. 5 మందికి పైగా వ్యక్తులు ఒకే చోట గుమిగూడడాన్ని నిషేధించారు. మాల్స్, రెస్టారెంట్లు, బార్లను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. అవసరమైన సేవలను అనుమతించారు. 50 శాతం సామర్థ్యంతో ప్రభుత్వ కార్యాలయాలను పనిచేయిస్తున్నారు. పరిశ్రమలు కొనసాగుతున్నాయి. నిర్మాణ పనులకు, మార్కెట్లకు ఎటువంటి ఆంక్షలను విధించలేదు.
అయితే బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మాట్లాడుతూ క్రీడాకారులందరికీ కోవిడ్ వ్యాక్సిన్ కోసం బోర్డు ఆరోగ్య మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతుందని చెప్పారు. ఈ క్రమంలో ఈ విషయంపై కేంద్రం నుంచి ప్రకటన వెలువడాల్సి ఉంది.