హైదరాబాద్ బిర్యానీకి ప్రపంచ వ్యాప్తంగా ఎంత పేరుందో అందరికీ తెలిసిందే. అయితే మన దేశంలో అనేక ప్రాంతాల్లోనూ బిర్యానీ అందుబాటులో ఉంటుంది. ఒక్కో ప్రాంత వాసులు భిన్న రకాలుగా బిర్యానీని వండుతారు. ఈ క్రమంలోనే బెంగళూరుకు సమీపంలో ఉన్న హోస్కోటెలోని ఆనంద్ దమ్ బిర్యానీ హోటల్‌లోనూ రుచికరమైన బిర్యానీ లభిస్తుంది. ఆ బిర్యానీ అంటు చుట్టు పక్కల వాసులే కాదు, బెంగళూరు ప్రజలకు కూడా ఎంతగానో ఇష్టం. అందుకనే ఆ హోటల్ ఎదుట బిర్యానీ కోసం కిలోమీటర్ మేర లైన్‌లో నిలబడుతుంటారు.
హోస్కోటెలోని ఆనంద్ దమ్ బిర్యానీ హోటల్‌లో కేవలం మంగళ, శుక్ర, ఆది వారాల్లోనే బిర్యానీని విక్రయిస్తారు. ఉదయం 6 గంటల నుంచే అక్కడ బిర్యానీని అమ్ముతారు. ఇందుకుగాను భోజన ప్రియులు ఉదయం 4 గంటలకే అక్కడకి చేరుకుని లైన్ లో నిలబడతారు. బెంగళూరుకు కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఆ హోటల్ ఉంటుంది. అందుకని ఆ హోటల్‌కు చాలా మంది వస్తుంటారు.
ఇక ఆ హోటల్‌లో కేవలం మటన్ బిర్యానీని మాత్రమే విక్రయిస్తారు. వారంలో 3 రోజులు మాత్రమే వారు బిర్యానీని అమ్మినా అమ్మకాలు జరిగే రోజుల్లో రోజుకు సగటును వారు 1000 కిలోల బిర్యానీని విక్రయిస్తారు. అయితే ఇటీవల లాక్‌డౌన్ ఆంక్షలు ఎత్తేశాక అక్కడ రద్దీ మరింత పెరిగింది. ఓ దశలో అక్కడ బిర్యానీ కోసం కిలోమీటర్ల మేర బారులు తీరారు. అప్పటి ఫొటోలు, వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న ఆ హోటల్ మటన్ బిర్యానీకి పాపులర్‌గా మారింది.