ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుంది. ఈ క్రమంలోనే భారతదేశంలో కూడా రోజురోజుకు ఈ మహమ్మారి బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ వైరస్ వ్యాప్తిలో కొత్తకొత్త లక్షణాలు బయటపడుతూ ప్రజలను కలవరపెడుతున్నాయి. అయితే కరోనా వైరస్ ఒకరి నుంచి ఒకరికి ఏ విధంగా వ్యాపిస్తుంది అనే విషయంపై తాజాగా పరిశోధకులు హెచ్చరించారు.
ఇంటి నుంచి బయటకు వెళ్లిన తర్వాత మనం ఎన్నో ప్రదేశాలను తాకుతాము. డబ్బులు సైతం ఒకరి నుంచి మరొకరికి చేతులు మారుతూ ఉంటాయి. అదేవిధంగా కొన్ని వస్తువులను తాకి అదే చేతితోనే ఆహారం తీసుకోవడం ద్వారా లేదా ఆ చేతులతో ముక్కు, నోటిని తాకడం ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుంది. బయటకు వెళ్ళిన తరువాత మాస్కులు లేకుండా, శానిటైజర్ లు వాడకుండా, ఉపరితలాన్ని తాకడం ద్వారా వైరస్ వ్యాప్తి అధికంగా జరుగుతుంది.
కరోనా వైరస్ తో బాధపడే వ్యక్తి ఒక ఉపరితలాన్ని తాకినప్పుడు, ఆ ఉపరితలాన్ని ఆరోగ్యవంతమైన వ్యక్తి తాకడం ద్వారా ఈ వైరస్ అతనికి వ్యాపిస్తుంది. ఈ విధంగా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తుంది కనుక ఏదైనా వస్తువులను తాకినప్పుడు వీలైనంత వరకు చేతులను, వస్తువులను శుభ్రంగా శానిటైజ్ చేయడం వల్ల ఈ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.