BGMI : దేశవ్యాప్తంగా ఉన్న పబ్‌జి ప్రియులకు మళ్లీ షాక్ తగిలింది. ఈ గేమ్‌ను తొలగించాలని కేంద్ర ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆండ్రాయిడ్, యాపిల్ యాప్ స్టోర్‌ల నుంచి ఈ గేమ్‌ను తొలగించారు. 2020 సెప్టెంబర్ 2వ తేదీన కేంద్రం పలు చైనీస్ యాప్‌లను నిషేధించింది. వాటిల్లో పబ్‌జి కూడా ఒకటి. అయితే దీనికి పేరు మార్చి ఎలాంటి చైనా సంస్థ సహాయం లేకుండానే గేమ్ డెవలపర్ క్రాఫ్టన్ మళ్లీ ఈ గేమ్‌ను మన దేశంలో లాంచ్ చేసింది.
అలా పబ్‌జి కాస్తా బ్యాటిగ్ గ్రాండ్స్ మొబైల్ ఇండియా (బీజీఎంఐ) పేరిట 2021 జూలై 2వ తేదీన ఈ గేమ్‌ను భారత్‌లో మళ్లీ లాంచ్ చేశారు. అయితే ఇటీవలే ఈ గేమ్‌కు గాను ఏడాది పూర్తయింది. కానీ కొందరు ఇచ్చిన పిటిషన్ కారణంగా గేమ్‌ను తొలగించాలని కేంద్రం గూగుల్, యాపిల్‌లకు నోటీసులు జారీ చేసింది. దీంతో గూగుల్ సంస్థ ఆండ్రాయిడ్ నుంచి.. యాపిల్ సంస్థ యాప్ స్టోర్ నుంచి ఈ గేమ్‌ను తొలగించాయి. అయితే గేమ్‌పై పూర్తి స్థాయిలో ఇంకా నిషేధం విధించలేదు. ఇది పాక్షిక నిషేధమే. కనుక ఇప్పటికే ఈ గేమ్ ఇన్‌స్టాల్ అయి ఉన్నవారు దీన్ని ఆడడం కొనసాగించవచ్చు. కానీ ఇకపై కొత్తగా ఇన్‌స్టాల్ చేయలేరు. పూర్తి స్థాయి విచారణ తరువాతే ఈ గేమ్ ను కొనసాగించాలా.. వద్దా.. అని నిర్ణయం తీసుకోనున్నారు. అందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక బీజీఎంఐ గేమ్‌ను 3 కారణాల వల్ల నిషేధించారని తెలుస్తోంది. పబ్‌జి గేమ్‌కే పేరుమార్చి ఈ గేమ్‌ను రిలీజ్ చేశారని.. కానీ చైనాతో లింకులు అలాగే కొనసాగిస్తున్నారని ప్రధాన ఆరోపణ. అలాగే ఈ గేమ్ వల్ల పిల్లలు, యువత ప్రభావానికి లోనై కుటుంబ సభ్యులను హత్య చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఓ బాలుడు పబ్‌జి కారణంగా తన తల్లిని చంపేశాడు. ఇక ఈ గేమ్ వల్ల బెట్టింగ్‌లు పెట్టడం, తల్లిదండ్రులకు తెలియకుండా వారి అకౌంట్లలోని డబ్బులను పిల్లలు దొంగిలించి దాంతో గేమ్‌లో ఐటమ్స్‌ను కొనడం వంటివి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మూడు కారణాల వల్లే బీజీఎంఐ గేమ్‌ను నిషేధించారని తెలుస్తోంది. అయితే ఈ గేమ్ భవితవ్యం ఏమిటనేది.. త్వరలోనే తేలనుంది.