Tachycardia : మీకు మీ గుండె వేగంగా కొట్టుకుందేమోనని అనుమానంగా ఉందా ? బీపీ చెక్ చేయించుకుంటే ఎక్కువగా ఉందా ? మీ గుండె గనక నిమిషానికి 100 సార్ల కన్నా ఎక్కువగా కొట్టుకుంటే దాన్ని టాకీకార్డియా (tachycardia) అంటారు. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది ? అంటే.. గుండె నుంచి శరీరంలోని ఇతర అవయవాలకు రక్తం సరఫరా అయ్యేందుకు ఒక రకమైన ఎలక్ట్రికల్ ఇంపల్స్ (విద్యుత్ ప్రవాహం) సహాయ పడుతుంది. ఈ విద్యుత్ ప్రవాహంలో ఏవైనా తేడాలు వస్తే అప్పుడు గుండె అసాధారణ రీతిలో వేగంగా కొట్టుకుంటుంది. కానీ ఇలా జరగడానికి చాలా వరకు మనం చేసే తప్పులే కారణం. అవును.. మనం మన జీవన విధానంలో చేసే తప్పులే మన గుండె వేగంగా కొట్టుకోవడానికి కారణమవుతున్నాయి. అవేమిటంటే..
టీ, కాఫీ, కూల్ డ్రింక్స్, చాకొలెట్లలో కెఫీన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని నిత్యం ఎక్కువగా తీసుకుంటే శరీరంలో కెఫీన్ మోతాదు పెరుగుతుంది. దీంతో రక్తపోటు పెరుగుతుంది. ఫలితంగా గుండె వేగంగా కొట్టుకుంటుంది. కనుక ఈ పదార్థాలను మోతాదులో తీసుకుంటే మంచిది. మద్యపానం, ధూమపానం చేసే వారిలో కూడా గుండె అసాధారణ రీతిలో వేగంగా కొట్టుకుంటుంది. ఈ అలవాట్లు ఉన్నవారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. బరువు తగ్గించే డైట్ పిల్స్, జలుబు, దగ్గు మెడిసిన్లతోపాటు కొకెయిన్ ఎక్కువగా తీసుకునే వారిలోనూ ఇలాగే గుండె వేగంగా కొట్టుకుంటుంది.
న్యుమోనియా, ఊపిరితిత్తుల్లో బాక్టీరియా ఇన్‌ఫెక్షన్ రావడం, లంగ్ క్యాన్సర్ వంటి పలు ఇతర కారణాల వల్ల కూడా గుండె వేగంగా కొట్టుకుంటుంది. టాకీకార్డియా వచ్చిన వారిలో రక్తహీనత కనిపిస్తుంది. అలాగే శరీరంలో పలు భాగాల్లో ఒక్కోసారి తీవ్ర రక్త స్రావం అవుతుంది. థైరాయిడ్ సమస్యలు ఉంటాయి. ఈ లక్షణాలు ఎవరిలో అయినా కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుడిని కలిసి చికిత్స తీసుకోవాలి. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలికి మారడం ద్వారా కూడా గుండె వేగంగా కొట్టుకోవడాన్ని తగ్గించుకోవచ్చు. నిత్యం వ్యాయామం చేయడం, సరైన సమయానికి పౌష్టికాహారం తీసుకోవడం, తగినన్ని గంటల పాటు నిద్రించడం చేస్తే గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు.