Chicken Soup : చికెన్‌తో కూర, బిర్యానీ, కబాబ్స్.. ఇలా చాలా మంది రక రకాల వంటలు చేసుకుని తింటారు. కానీ చికెన్‌తో సూప్ చేసుకుని తాగితేనే ఎక్కువ ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. చికెన్ సూప్ తాగడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. చర్మం, వెంట్రుకల సమస్యలు పోతాయి. ఎముకలు దృఢంగా మారుతాయి. ఇంకా ఎన్నో ప్రయోజనాలు మనకు చికెన్ సూప్ తాగడం వల్ల కలుగుతాయి. ఈ క్రమంలోనే చికెన్ సూప్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావల్సిన పదార్థాలు..
బోన్‌లెస్ చికెన్ – 85 గ్రాములు, క్యాబేజీ – 30 గ్రాములు (సన్నగా కట్ చేసుకోవాలి), క్యారెట్ – 30 గ్రాములు (సన్నగా కట్ చేయాలి), కార్న్ ఫ్లోర్ – ఒకటిన్నర టీ స్పూన్, నూనె – 10 గ్రాములు, ఉప్పు – అర టీస్పూన్, వెల్లుల్లి – 4 టీస్పూన్లు (సన్నగా కట్ చేయాలి), కారం – అర టీస్పూన్, చక్కెర – 1 టీస్పూన్, మిరియాల పొడి – అర టీస్పూన్, ఉల్లిపాయ – 1 (పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి), సోయా సాస్ – అర టేబుల్ స్పూన్, వెనిగర్ – 1 టేబుల్ స్పూన్.
తయారు చేసే విధానం..
ముందుగా చికెన్‌ను బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి. అందులో మూడు కప్పుల నీరు పోయాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు, రెండు వెల్లుల్లి రెబ్బలను వేసి బాగా ఉడకబెట్టాలి. ఆ తరువాత వచ్చే పదార్థాన్ని చికెన్ స్టాక్ అంటారు. దీన్ని వడకట్టి ఫ్రిజ్‌లో వారం పాటు నిల్వ చేసుకోవచ్చు. అవసరం అనుకున్నప్పుడు వాడుకోవాలి. పాన్ తీసుకుని అందులో నూనె వేసి వేడి చేయాలి. అనంతరం అందులో వెల్లుల్లి, క్యాబేజీ, క్యారెట్ ముక్కలు వేసి కొంచెం వేయించాలి. ముక్కలు మరీ బాగా ఎర్రబడాల్సిన అవసరం లేదు.
ఆ తరువాత అందులో చికెన్ స్టాక్ ముక్కలను వేసి ఉడికించాలి. అనంతరం అందులో ఉప్పు, కారం, మిరియాల పొడి, చక్కెర, వెనిగర్, సోయాసాస్‌లను వేసి బాగా కలపాలి. 10 నిమిషాల పాటు అలా బాగా ఉడికించాలి. అనంతరం కార్న్ ఫ్లోర్‌లో నీటిని కలిపి ఆ మిశ్రమాన్ని ఉడుకుతున్న సూప్‌లో పోయాలి. అలా ఆ మిశ్రమాన్ని పోస్తూ సూప్‌ను బాగా కలుపుతూ ఉడికించాలి. ఇక దించే ముందు చిల్లీసాస్ చల్లుకోవాలి. దీంతో వేడి వేడి చికెన్ సూప్ తయారవుతుంది. ఆ తరువాత వేడిగా ఉండగానే సూప్‌ను తాగేయాలి.