Mango Ice Cream : వేసవి కాలంలో సహజంగానే మనకు మామిడి పండ్లు విరివిగా లభిస్తుంటాయి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటుంటారు. వీటితో మనం పలు రకాల పిండి వంటలు, జ్యూస్‌లను కూడా చేసుకోవచ్చు. ఇవి కూడా ఎంతో టేస్టీగా ఉంటాయి. అయితే మామిడి పండ్లతో చేసే ఐస్‌క్రీమ్‌లను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. కాస్త శ్రమిస్తే మనం ఇంట్లోనే వీటిని తయారు చేసుకోవచ్చు. వీటిని ఎలా చేయాలో, వీటి తయారీకి ఏమేం కావాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మ్యాంగో ఐస్‌క్రీమ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
చిక్కని క్రీమ్ – 2 కప్పులు, చక్కెర పొడి – అర కప్పు, మామిడి పండు గుజ్జు – ముప్పావు కప్పు, ఎల్ల ఫుడ్ కలర్ – చిటికెడు, టూటీ ఫ్రూటీ పలుకులు – కొన్ని.
మ్యాంగో ఐస్‌క్రీమ్‌ను తయారు చేసే విధానం..
ఒక గిన్నెలో క్రీమ్, చక్కెర పొడి వేసుకుని కనీసం 5 నిమిషాలపాటు గిలకొట్టుకోవాలి. తరువాత మిగిలిన పదార్థాలను ఒక్కొక్కటిగా వేసుకుని మళ్లీ గిలకొట్టుకోవాలి. ఇలా చేసుకున్న మిశ్రమాన్ని చల్లగా అయ్యే వరకు ఫ్రిజ్‌లో పెట్టాలి. దీంతో ఐస్ క్రీమ్ రెడీ అవుతుంది. కనీసం 6 నుంచి 7 గంటలపాటు ఫ్రిజ్‌లో పెడితే చాలు, ఐస్ క్రీమ్ రెడీ అయినట్లే. దీన్ని తరువాత తీసి తినేయడమే. ఇలా తయారు చేసిన ఐస్‌క్రీమ్‌ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.