Banana Face Pack : అరటి పండ్లను తినడం వల్ల ఎన్ని అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. అరటి పండు జీర్ణశక్తిని పెంచుతుంది. ఎముకలను బలంగా మారుస్తుంది. శక్తిస్థాయిలను పెంచుతుంది. అరటి పండు మన ఆరోగ్యానికి ఏ విధంగా మేలు చేస్తుందో అందరికీ తెలుసు. అయితే అరటి పండు మీ చర్మ కాంతిని కూడా పెంచుతుందని మీకు తెలుసా ? అరటి పండ్లలో అనేక పోషకాలు ఉంటాయి. ఫైబర్, పొటాషియం, విటమిన్ సి, విటమిన్ బి6. ఇలా ఎన్నో సూక్ష్మ పోషకాలు ఈ పండ్లలో ఉంటాయి. అరటి పండ్లు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని పలు ఇతర పదార్థాలతో కలిపి ఫేస్ ప్యాక్‌లను తయారు చేసి ఉపయోగించడం వల్ల మీ ముఖంలో కాంతి పెరుగుతుంది. చర్మం సురక్షితంగా ఉంటుంది. మీరు అనుకున్న ఫలితాలు వస్తాయి.
ప్రతి ఒక్కరు క్లీన్‌గా మచ్చలు లేని ముఖం ఉండాలని కోరుకుంటారు. ఇందుకు గాను మార్కెట్‌లో లభించే అనేక రకాల ఖరీదైన సౌందర్య సాధన ఉత్పత్తులను కొని వాడుతుంటారు. అయితే ఇవి అప్పటికప్పుడు ఫలితాన్ని ఇచ్చినా వీటిని దీర్ఘకాలికంగా ఉపయోగిస్తే ఇవి కెమికల్స్ కాబట్టి మన చర్మానికి, మన ఆరోగ్యానికి హాని కలుగుతుంది. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. కనుక మనం ఎల్లప్పుడూ అందాన్ని పెంచుకునేందుకు సహజసిద్ధమైన ఉత్పత్తులనే ఉపయోగించాలి. అలాంటి పదార్థాల్లో అరటి పండు కూడా ఒకటి. దీంతో అందాన్ని ఎలా పెంచుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.

బాగా పండిన ఒక అరటి పండును తీసుకుని అందులో డార్క్ చాకొలెట్ వేసి కలపాలి. అందులోనే రోజ్ వాటర్‌ను కూడా పోసి మెత్తగా పట్టుకోవాలి. దీంతో మెత్తని పేస్ట్ రెడీ అవుతుంది. దీన్ని ముఖంపై అప్లై చేయాలి. 20 నిమిషాలపాటు ఉన్నాక కడిగేయాలి. అలాగే అరటి పండు, తేనె మిశ్రమం కూడా పనిచేస్తుంది. అరటి పండులో హైడ్రేటింగ్ గుణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని మృదువుగా, తేమగా ఉంచుతాయి. అలాగే తేనె చర్మం యొక్క పీహెచ్ స్థాయిలను బ్యాలెన్స్ చేస్తుంది. చర్మానికి తేమను అందిస్తుంది. ముఖంపై ముడతలను తగ్గిస్తుంది. అందువల్ల ఈ రెండింటి మిశ్రమాన్ని ముఖానికి రాసి 30 నిమిషాలు అయ్యాక కడిగేయాలి. ఇలా వారంలో కనీసం 3 సార్లు చేస్తే మీ ముఖంలో కాంతి పెరుగుతుంది. మొటిమలు తగ్గుతాయి.
మీకు కాంతివంతమైన, మచ్చలు లేని ముఖం కావాలంటే అరటి పండు, పచ్చి పాలు ఉపయోగపడతాయి. ఈ రెండింటి మిశ్రమంలో కాస్త తేనె వేసి బాగా కలిపి ముఖానికి రాయాలి. 15 నుంచి 20 నిమిషాలు అయ్యాక కడిగేయాలి. అలాగే అరటి పండు, నిమ్మకాయ మిశ్రమాన్ని కూడా ప్రయత్నించవచ్చు. బాగా పండిన అరటిపండులో అర టీస్పూన్ నిమ్మరసం, కాస్త తేనె కలిపి పేస్ట్‌లా చేసి దీన్ని ముఖానికి ఫేస్ ప్యాక్‌లా రాయాలి. 30 నిమిషాలు అయ్యాక కడిగేయాలి. వారంలో ఇలా 2 సార్లు చేస్తే ముఖం కాంతివంతంగా మారి మెరుస్తుంది. మీ ముఖం కళగా మారుతుంది. మొటిమలు, మచ్చలు ఉండవు. ఇలా ఈ అరటి పండు ఫేస్ ప్యాక్‌లతో మీ ముఖ సౌందర్యాన్ని రెట్టింపు చేసుకోవచ్చు.