Mobile Data : టెలికాం రంగంలో మన దేశంలో వచ్చినన్ని మార్పులు దాదాపుగా ఏ దేశంలోనూ రాలేదనే చెప్పవచ్చు. జియో రాకతో స్మార్ట్ ఫోన్ వినియోగమే మారిపోయింది. పేదలకు కూడా అత్యంత చవక ధరలకే మొబైల్ డేటా అందుబాటులోకి వచ్చింది. అంతకు ముందు వరకు కేవలం 1 జీబీ మొబైల్ డేటా కావాలంటే టెలికాం కంపెనీలకు సుమారుగా రూ.250 పైనే ఖర్చు చేయాల్సి వచ్చేది. కానీ జియో రాకతో ఒక్కసారిగా స్వరూపమే మారిపోయింది. ఆ కంపెనీ కేవలం మొబైల్ డేటాకు మాత్రమే చార్జిలను వసూలు చేస్తుండడంతో ఇతర టెలికాం కంపెనీలు కూడా దిగి రాక తప్పలేదు. ఇక మొబైల్ డేటా విషయానికి వస్తే మన దేశంలో ప్రస్తుతం యావరేజ్‌గా 1జీబీ మొబైల్ డేటా ఖరీదు రూ.14.20 గా ఉంది. ఇక ఇతర దేశాల్లో 1జీబీ మొబైల్ డేటా కావాలనుకుంటే ఎంత ఖర్చు అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
1జీబీ మొబైల్ డేటా ఖరీదు ప్రపంచంలో ఇప్పుడు దక్షిణ కొరియాలో ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. అక్కడ 1జీబీ డేటా కావాలనుకుంటే దాదాపుగా రూ.1048 వరకు ఖర్చు చేయాల్సిందే. అలాగే మొబైల్ డేటా ఖరీదు అధికంగా ఉన్న దేశాల్లో కెనడా 2వ స్థానంలో ఉంది. అక్కడ 1జీబీ డేటా ఖరీదు దాదాపుగా రూ.496. అలాగే 3వ స్థానంలో అమెరికా ఉంది. అక్కడ 1జీబీ డేటాకు 5.62 డాలర్లు చెల్లించాలి. అంటే మన కరెన్సీలో దాదాపుగా రూ.469 అన్నమాట.
ఇక అమెరికా తరువాత జపాన్‌లో 1జీబీ డేటాకు రూ.321, జర్మనీలో రూ.223, ఆస్ట్రేలియాలో రూ.47, కొలంబియాలో రూ.40, మలేషియాలో రూ.37, చైనాలో రూ.34, టర్కీలో రూ.32, ఫ్రాన్స్‌లో రూ.19 ఖర్చు అవుతుంది. తరువాతి స్థానంలో ఇండియా ఉంది. మన దగ్గర 1జీబీ మొబైల్ డేటాకు 0.17 డాలర్లు అవుతుంది. అంటే దాదాపుగా రూ.14 అన్నమాట. తరువాత ఇటలీలో 1జీబీ మొబైల్ డేటాకు రూ.10 అవుతుంది. ఇక అత్యల్పంగా ఇజ్రాయెల్‌లో 1జీబీ మొబైల్ డేటాకు కేవలం రూ.3.34 మాత్రమే అవుతుంది. అందుకనే ఆ దేశం టెక్నాలజీలో అత్యంత అగ్రగామిగా ఉందని చెప్పవచ్చు.