సాధారణంగా పాలకోవా అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. అయితే ఎప్పుడూ పాలకోవా తినాలన్నా కూడా కొన్నిసార్లు విరక్తి కలుగుతుంది. ఇలాంటప్పుడే పాలతో కొంచెం వెరైటీగా కొబ్బరి కలిపి కొబ్బరి కోవా తయారు చేసుకుంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. మరి ఎంతో రుచికరమైన కొబ్బరి కోవాను ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు
*కొబ్బరి తురుము రెండు కప్పులు
*చిక్కని పాలు లీటరు
*చక్కెర అర కిలో
*యాలకులు 6
*జీడిపప్పు ఒక చిన్న కప్పు
*కుంకుమ పువ్వు చిటికెడు
*నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు
తయారీ విధానం
ముందుగా ఒక మందపాటి పాత్రలో పాలు పోసి స్టవ్ మీద చిన్నమంటపై పాలను భాగ మరిగించాలి. పాలు మొత్తం కోవా ముద్దలా తయారయ్యే వరకు వేడి చేయాలి. పాలు మరుగుతున్న సమయంలోనే ఒక వెడల్పాటి పాత్రలో కొబ్బరి తురుము పంచదార వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. పాలు బాగా మరిగించి ముద్దగా అవుతున్న సమయంలో ఆ పాలలోకి కొబ్బరి తురుము, చక్కెర కలిపిన మిశ్రమాన్ని వేసి బాగా కలియబెట్టాలి. పాలలో నీరు మొత్తం ఇంకి పోయాక జీడిపప్పులు, ఏలకులపొడి, కుంకుమ పువ్వు వేసి బాగా కలియబెట్టి దింపాలి.
తరువాత ఒక పెద్ద ప్లేట్ పై నెయ్యి పూసి ఈ మిశ్రమాన్ని ఆ ప్లేట్ లో వేసి ప్లేటు మొత్తం సమానంగా పరచాలి. పది నిమిషాలు ఈ మిశ్రమాన్ని గాలికి ఆరనివ్వాలి. పది నిమిషాల తర్వాత ఈ మిశ్రమాన్ని మనకు కావలసిన ఆకారంలో కట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కొబ్బరి కోవా తయారైనట్లే. ఈ కొబ్బరి కోవాను మనం మూడు నాలుగు రోజుల పాటు నిల్వ ఉంచుకోవచ్చు. మరెందుకాలస్యం ఇప్పుడే కొబ్బరి కోవాను ప్రయత్నించండి.