కరోనా సెకండ్ వేవ్ భారత ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. గతంలో కన్నా అత్యంత వేగంగా కొత్త కోవిడ్ స్ట్రెయిన్లు వ్యాప్తి చెందుతున్నాయి. దీంతో ప్రజలు గతంలో కన్నా ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అయితే కోవిడ్ బారిన పడి ఇంట్లో చికిత్స తీసుకుంటున్న వారు ఆక్సిజన్ లెవల్స్ తగ్గితే ఏం చేయాలో డాక్టర్లు సమాధానాలు చెబుతున్నారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంట్లో ఉండి చికిత్స తీసుకుంటున్న కోవిడ్ బాధితులు ఆక్సిజన్ లెవల్స్ ను ఎప్పటికప్పుడు పరీక్షించాలి. తగ్గినట్లు అనిపిస్తే ఇంటి వద్ద ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేటర్స్‌ను వాడవచ్చు. శ్వాస వ్యాయామాలు చేయాలి. బెడ్ మీద బోర్లా పడుకుని 30 నిమిషాల నుంచి 2 గంటల పాటు ఉండాలి. అలాగే పక్క వైపుకు తిరిగి కూడా 30 నిమిషాల నుంచి 2 గంటల వరకు ఉండాలి. అలాగే కూర్చుని 30 నిమిషాల నుంచి 2 గంటల పాటు ఉండాలి. సౌకర్యాన్ని బట్టి సమయం పాటించవచ్చు.
ఇలా చేయడం వల్ల ఆక్సిజన్ స్థాయిలు మెరుగవుతాయి. ఈ విషయాన్ని తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్వయంగా వెల్లడించింది. ఇక ఇవన్నీ చేసినా ఆక్సిజన్ స్థాయిలు పడిపోతున్నాయి అనుకునే వారు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వాల్సి ఉంటుంది.