ముంబైలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 టోర్నీ 19వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది. చెన్నై నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బెంగళూరు తడబడింది. గత 4 మ్యాచ్‌లలోనూ ఓటమి అంటూ ఎరుగని జట్టుగా బెంగళూరు విజయాల పరంపరను నమోదు చేసింది. అయితే బెంగళూరుకు దూకుడుకు చెన్నై బ్రేక్ వేసింది. ఈ క్రమంలో బెంగళూరుపై చెన్నై 69 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై ముందుగా బ్యాటింగ్ చేపట్టింది. ఈ క్రమంలో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. చెన్నై బ్యాట్స్‌మెన్లలో రవీంద్ర జడేజా, డుప్లెసిస్‌లు అద్భుతంగా రాణించారు. 28 బంతుల్లోనే జడేజా 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 62 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, 41 బంతుల్లో డుప్లెసిస్ 5 ఫోర్లు, 1 సిక్సర్‌తో 50 పరుగులు చేశాడు. బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్ 3 వికెట్లు పడగొట్టగా, యజువేంద్ర చాహల్‌కు 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 122 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో పడిక్కల్ మినహా ఎవరూ రాణించలేదు. 15 బంతుల్లో పడిక్కల్ 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 34 పరుగులు చేశాడు. చెన్నై బౌలర్లలో జడేజా 3 వికెట్లు పడగొట్టగా, ఇమ్రాన్ తాహిర్ 2 వికెట్లు తీశాడు. శామ్ కుర్రాన్, శార్దూల్ ఠాకూర్‌లకు చెరొక వికెట్ దక్కింది.