కరోనా నేపథ్యంలో గతేడాది మార్చి నెల చివరి నుంచి పలు దశల్లో విడతల వారీగా దేశవ్యాప్త లాక్ డౌన్‌ను విధించి అమలు చేశారు. అయితే ఈ సారి మాత్రం దేశవ్యాప్త లాక్ డౌన్ లేదు. ఆ బాధ్యతను కేంద్రం రాష్ట్రాలకే అప్పగించింది. దీంతో రాష్ట్రాలు తమకు తాముగా లాక్ డౌన్ లను విధించుకుంటున్నాయి. అయితే కోవిడ్ మూడో వేవ్ వస్తుందని నిపుణులు హెచ్చరిస్తుండడంతో మరోమారు దేశవ్యాప్త లాక్‌డౌన్ ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కోవిడ్ మూడో వేవ్ ముప్పు పొంచి ఉంది కనుక జూలై 1 నుంచి 31వ తేదీ వరకు దేశ వ్యాప్త లాక్‌డౌన్ విధించబోతున్నారని ఓ వార్త సోషల్ మీడియాలో తెగ ప్రచారం అవుతోంది. అయితే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఈ వార్తను అబద్దమని తేల్చింది. అలాంటి ఉత్తర్వులను కేంద్రం జారీ చేయలేదని, కనుక అది ఫేక్ వార్త అని తెలిపింది.
కాగా కోవిడ్ నేపథ్యంలో ఇప్పటికే అనేక పుకార్లు సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలో అసలు ఏదో, ఫేక్ వార్త ఏదో ప్రజలు తెలుసుకోలేక కన్‌ఫ్యూజన్‌కు గురవుతున్నారు. అందుకనే పీఐబీ ఎప్పటికప్పుడు ఫ్యాక్ట్ చెక్ ద్వారా ప్రజలకు నిజాలను తెలియజేస్తోంది. ఇక పైన తెలిపిన వార్తను కూడా పీఐబీ తన ఫ్యాక్ట్ చెక్ ద్వారా అబద్దమని తేల్చింది.