స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన ఖాతాదారులకు తాజాగా హెచ్చరికలు చేసింది. ప్రస్తుతం ఆన్‌లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో నేరస్థులు మోసం చేసేందుకు కొత్త పంథాను ఎంచుకున్నారని ఎస్‌బీఐ తెలిపింది. అందువల్ల అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎస్‌బీఐ హెచ్చరించింది. ఈ మేరకు ఎస్‌బీఐ ట్వీట్ చేసింది.
మీకు గిఫ్ట్‌లు పంపిస్తామంటూ ఏమైనా మెసేజ్‌లు, ఈ-మెయిల్స్ వస్తున్నాయా ? అయితే అస్సలు నమ్మకండి. ఎందుకంటే ఆ మెసేజ్‌లు నమ్మి అందులో ఉండే లింక్‌లను ఓపెన్ చేస్తే వారు మీ బ్యాంక్ ఖాతా వివరాలు అడుగుతారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్, యూపీఐ వివరాలు, డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలను అడుగుతారు. మీరు నమ్మి ఆ వివరాలను ఆ లింక్‌లో ఉన్న వెబ్‌సైట్‌లో ఎంటర్ చేస్తే అంతే సంగతులు. వెంటనే మీ బ్యాంకు ఖాతాలో ఉన్న నగదు మొత్తం క్షణాల్లో మాయమవుతుంది. ప్రస్తుతం ఈ తరహా మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని, కనుక ఎవరైనా సరే మీకు బహుమతులను పంపిస్తామని, బ్యాంకు వివరాలను ఎంటర్ చేయాలని అడిగితే అస్సలు నమ్మకూడదని ఎస్‌బీఐ హెచ్చరించింది.
https://twitter.com/TheOfficialSBI/status/1409874566516822026
ఇక బ్యాంకు ఎప్పుడు ఖాతాదారులకు చెందిన వివరాలను అడగదని, ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలని ఎస్‌బీఐ తెలిపింది. బహుమతులను పంపేవారు డబ్బులు అడగరని, డబ్బులు అడుగుతున్నారంటే అందులో మోసం ఉందని గ్రహించాలని ఎస్‌బీఐ తెలియజేసింది.