ప్రథమ పూజ్యుడైన వినాయకుడికి ఎంతో ఇష్టమైన రోజులలో సంకష్టహర చతుర్దశి ఒకటి. ఈ సంకష్టహర చతుర్థి రోజు వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సంకష్టహర చతుర్థి ప్రతి పౌర్ణమి తరువాత మూడు రోజులకు వస్తుంది. అలాగే నేడు సంకష్టహర చతుర్దశి కావడంతో వినాయకునికి పెద్దఎత్తున పూజలను నిర్వహిస్తారు. ఈ రోజు భక్తులు ఉపవాస దీక్షలతో స్వామివారికి వ్రతం ఆచరించడం వల్ల అనుకున్న కోరికలు దిగ్విజయంగా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.
సంకష్టహర చతుర్దశి రోజు వేకువ జామునే నిద్రలేచి తలంటు స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కఠిన ఉపవాస దీక్షలను చేయాలి.సాయంత్రం చంద్రుని దర్శనం తర్వాత ఉపవాస దీక్షను విరమించి వినాయకుడికి సంకష్ట హర చతుర్థి వ్రతం ప్రారంభించాలి. వివిధ రకాల పుష్పాలతో స్వామివారిని అలంకరించాలి. ముఖ్యంగా వినాయకుడికి ఎంతో ఇష్టమైన గరిక, మోదకాలను సమర్పించి పూజ చేయటం వల్ల స్వామివారి ప్రీతి చెంది మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.
ఈ విధంగా వినాయకుడికి పూజ చేసిన తర్వాత మన కోరిక నెరవేరాలంటే ఆరు మీటర్ల ఎర్రని వస్త్రంలో 3 పిడకలు బియ్యం, తమలపాకులు, రెండు ఎండు ఖర్జూరాలు, వక్కలు, దక్షణ, పసుపు కుంకుమలను సమర్పించి వాటిని మూటకట్టి ధూప దీపాలతో పూజించాలి. అదేవిధంగా సంకష్టహర వ్రతం చదవటంవల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.