సండే వచ్చిందంటే చాలు ఉదయం నుంచి సాయంత్రం దాకా మన ఇంట్లో వివిధ రకాల నాన్ వెజ్ రెసిపీలు ఉండాల్సిందే. అయితే నాన్ వెజ్ లో ఎక్కువగా చికెన్ బిర్యాని తినడానికి చాలా మంది ఇష్టపడతారు. మరి హోటల్ రుచిని తలపించే యమ్మీ..యమ్మీ చికెన్ బిర్యాని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు
*చికెన్ అరకిలో
*బాస్మతి రైస్ రెండు కప్పులు
*అల్లం వెల్లుల్లి పేస్టు రెండు టేబుల్ స్పూన్లు
*ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు
*కరివేపాకు
*పుదీనా
*చిటికెడు పసుపు
*కొత్తిమీర
*ఉప్పు తగినంత
*కారం రెండు టేబుల్ స్పూన్లు
*పచ్చిమిర్చి ముక్కలు
*నూనె సరిపడినంత
*పెరుగు అర కప్పు
*నిమ్మకాయ
*బిర్యానీ దినుసులు(బిర్యానీ ఆకులు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు,)
తయారీ విధానం
ముందుగా చికెన్ ను శుభ్రంగా చేసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, నిమ్మకాయ, పెరుగు వేసి బాగా కలియబెట్టి కొని ఒక అరగంట పాటు ఫ్రిజ్లో ఉంచాలి. ఈ లోగ బాస్మతి బియ్యాన్ని ఒక గంట ముందే నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె ఉంచి కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్ళు వేసి అన్నం చేసుకోవాలి. బాస్మతి బియ్యాన్ని 70 శాతం మాత్రమే ఉడికించాలి. అదేవిధంగా స్టవ్పై మరొక గిన్నె పెట్టి కొద్దిగా నూనె వేయాలి. నూనె బాగా వేడి అయిన తర్వాత బిర్యాని దినుసులు వేయాలి. అదేవిధంగా ముందుగా తరిగి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఎంత ఎర్రగా అయితే బిర్యాని అంత రుచిగా వస్తుంది. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఏర్పడగానే పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర,పుదీనా వేసి వేయించుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకొన్న చికెన్ ముక్కలను వేసి ఓ పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని ఒక లేయర్ ఉడికించిన చికెన్, దానిపై మరొక లేయర్ బాస్మతి రైస్ ఇలా పొరలుపొరలుగా వేసుకొని ఆ గిన్నెపై మూత పెట్టి ఆవిరి బయటకు రాకుండా మూత చుట్టూ మైదా పిండి పెట్టి బరువు పెట్టాలి. ఈ విధంగా ఐదు నిమిషాల పాటు తక్కువ మంట పెట్టడం వల్ల ఎంతో రుచికరమైన గుమగుమలాడే బిర్యాని తయారైనట్లే.