కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ)ని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేయడంతోపాటు మరి కొంత మంది సీనియర్ నేతలకు కాంగ్రెస్ అధిష్టానం పలు కీలక పదవులను కట్టబెట్టింది. ఈ క్రమంలో పదవులు ఆశించి భంగ పడిన వారికి ఆ పార్టీ అధిష్టానం సర్ది చెప్పినట్లు తెలిసింది. కానీ టీపీసీసీ అధ్యక్షుడిని ప్రకటించి ఒక్క రోజు కూడా కాకముందే ఆ పార్టీలో రాజకీయ వేడి రగిలింది.
నూతనంగా ఎంపికైన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసు విధంగానే టీపీసీసీ అధ్యక్షుడి ఎన్నిక జరిగిందని తాను ఢిల్లీ వెళ్లాక తెలిసిందని ఆరోపించారు. పీసీసీలో కార్యకర్తలకు తగిన గుర్తింపు లేదన్నారు. టీపీసీసీ కాస్తా త్వరలో టీటీడీపీగా మారబోతుందని అన్నారు.
తనను కలిసేందుకు రేవంత్ రెడ్డి సహా కొందరు ప్రయత్నిస్తున్నారని, అయితే తనను ఎవరూ కలవొద్దని వెంకటరెడ్డి అన్నారు. సోమవారం నుంచి తాను పాదయాత్ర చేస్తానని, ఇబ్రహీం పట్నం నుంచి భువనగిరి వరకు యాత్ర కొనసాగుతుందని చెప్పారు. కొత్తగా ఎంపికైన పీసీసీ నాయకులు హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ను గెలిపించేందుకు కష్టపడాలన్నారు.
అయితే పీసీసీ అధ్యక్షుడి రేసులో రేవంత్‌తోపాటు వెంకటరెడ్డి పేరు కూడా బలంగా వినిపించింది. మొదట్నుంచీ వెంకట రెడ్డి ఆ పదవి కోసం రేసులో ఉన్నారు. చాలా మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు వెంకట రెడ్డికి మద్దతుగా మాట్లాడారు. దీంతో పీసీసీ అధ్యక్ష పదవి ఆయనకే దక్కుతుందని భావించారు. అయినప్పటికీ అనూహ్యంగా ఆ పదవి రేవంత్ రెడ్డిని వరించింది. దీంతో గుర్రుగా ఉన్న వెంకట రెడ్డి ఎట్టకేలకు తనలో ఉన్న అసంతృప్తిని ఈ విధంగా బయట పెట్టారు. మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏమంటుందో చూడాలి.