మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో దారుణం చోటు చేసుకుంది. ఉపాధి లేక ఓ మహిళ పని ఇప్పించమని సహాయం కోసం వస్తే ఓ తండ్రి, కొడుకు ఇద్దరూ కలిసి ఆమెను కొన్ని నెలల పాటు బంధించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను ఇంకో వ్యక్తికి అమ్మేశారు. ఈ క్రమంలో బాధితురాలిని పోలీసులు రక్షించి నిందితులపై కేసులు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన రతిబాద్ ఏరియాలో ఉంటున్న 27 ఏళ్ల మహిళ భర్తను 6 నెలల కిందట పోలీసులు ఓ కేసులో అరెస్టు చేసి జైలుకు తరలించారు. దీంతో ఆమె బతుకు భారం అయింది. పోషించేవారు కరువయ్యారు. ఈ క్రమంలో ఆమె పని కావాలని అదే ప్రాంతానికి చెందిన రవి అనే వ్యక్తిని కోరింది. అయితే రవి ఆమెకు పని ఇప్పిస్తానని చెప్పి తన ఇంటికి తీసుకెళ్లి ఆమెను బంధించాడు. అనంతరం ఆమెపై అత్యాచారం చేశాడు. తరువాత అతని తండ్రి రమేష్ కూడా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
అలా వారిద్దరూ ఆమెను కొన్ని నెలల పాటు బంధించి ఆమెపై రోజూ అత్యాచారం చేశారు. చివరికి అదే ప్రాంతానికి చెందిన సర్మాన్ ప్రజాపతి (38) అనే వ్యక్తికి ఆమెను వారు రూ.60వేలకు విక్రయించారు. అతను ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ ఇద్దరికి ఆ మొత్తం చెల్లించి ఆమెను తీసుకెళ్లాడు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను ప్రజాపతి బారి నుంచి రక్షించారు. తరువాత నిందితులు ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. కాగా రవి, రమేష్ లు ఇద్దరూ ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.