దేశవ్యాప్తంగా కరోనాతో బాధపడుతున్నవారికి వారి శరీరంలో ఊపిరితిత్తులు పూర్తిగా ధ్వంసమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆక్సిజన్ తీసుకోవడానికి ఎంతో ఇబ్బంది పడుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ విధంగా కోవిడ్ కారణంగా ఊపిరితిత్తుల బాగా దెబ్బ తిన్న వారికి బొడ్డుతాడులోని మూల కణాల ద్వారా చికిత్స చేయవచ్చని ట్రాన్స్‌సెల్ ఆంకాలాజిక్స్ ఫౌండర్ డాక్టర్ సుభద్ర ద్రావిడ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్ విశ్వవిద్యాలయంలోని అస్పైర్ టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్‌కు చెందిన బయోటెక్ స్టార్టప్ సంస్థ ‘ట్రాన్స్ సెల్ ఆంకాలజిక్స్’ వైవిద్యభరితమైన ఈ కొవిడ్ చికిత్సను ప్రారంభించిందని ఆమె పేర్కొన్నారు.సాధారణంగా కరోనాతో బాధపడుతున్న వారిలో ఊపిరితిత్తులు ఎక్కువభాగం దెబ్బతింటాయి.ఈ క్రమంలోనే మన శరీరం విడుదల చేసే కొన్ని రసాయనాలు తిరిగి ఊపిరితిత్తులను చేరుకోవడం వల్ల ఊపిరితిత్తుల పై మరింత ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి.
ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో కరోనా మహమ్మారి నుంచి ఊపిరితిత్తులను రక్షించడానికి బొడ్డుతాడులో ఉన్నటువంటి మూలకణాలు ఎంతో ఉపయోగపడతాయని వీటి ద్వారా కరోనాకు చికిత్సను అందించవచ్చని డాక్టర్ సుభద్ర ద్రావిడ పేర్కొన్నారు.బొడ్డుతాడు నుంచి తీసిన ఈ మూలకణాలను ఇంజెక్షన్ల రూపంలో శరీరంలోకి ఎక్కించడం వల్ల శరీరంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని ఆమె తెలిపారు.
ప్రస్తుతం ఈ విధానాన్ని అమెరికాలో ఉపయోగించటం వల్ల ఎంతో మంచి ఫలితాలు ఉన్నాయని, దీనినే ఇండియాలో కూడా అమలు చేయాలని ఆమె పేర్కొన్నారు.వివిధ ఆసుపత్రుల నుంచి సేకరించిన బొడ్డు తాళ్ల నుంచి మూలకణాలను రెట్టింపు చేసి కరోనాతో బాధపడేవారికి ఇంజెక్షన్ల రూపంలో ఇవ్వడం ద్వారా కరోనా నుంచి విముక్తి పొందవచ్చు అని డాక్టర్ సుభద్ర తెలిపారు.