ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి ఇదొక శుభవార్త అనే చెప్పాలి. దేశంలోనే అతి పెద్ద బ్యాంక్ అయిన ఎస్‌బీఐ ఇటీవలే 13,735 క్లర్క్ (జూనియర్ అసోసియేట్) పోస్టుల భర్తీకి గాను నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా తెలంగాణ (హైదరాబాద్) సర్కిల్‌లో 342 ఖాళీలు ఉన్నాయి. అప్లై చేసుకోవడానికి https://ibpsonline.ibps.in/sbidrjadec24/ అనే లింక్ ను సందర్శించవచ్చు. ఏదైనా డిగ్రీలో పాస్ అయిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులే. అభ్యర్థుల వయస్సు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు జనవరి 7వ తేదీ వరకు గడువు విధించారు.
మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు పైన ఇచ్చిన వెబ్‌సైట్ లింక్‌ను సందర్శించవచ్చు. మొత్తం క్లర్క్ పోస్టుల సంఖ్య 13,735 కాగా ఏపీలో 50, తెలంగాణలో 342 పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు గాను ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ పరీక్ష, స్థానిక భాష మీద టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఫిబ్రవరి 2025 నెలలో ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉండే చాన్స్ ఉంది. కచ్చితమైన తేదీలను త్వరలోనే ప్రకటించనున్నారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం మెయిన్స్ ఎగ్జామ్‌ను మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో నిర్వహిస్తారు. ఈ తేదీని కూడా త్వరలోనే ప్రకటించనున్నారు. ప్రిలిమినరీ ఎగ్జామ్‌లో భాగంగా 100 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఇందులో మూడు విభాగాలు ఉంటాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు 30 మార్కులకు, న్యూమరికల్ ఎబిలిటీ 35 ప్రశ్నలు, 35 మార్కులకు, రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు 35 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం 60 నిమిషాలు. నెగెటివ్ మార్కుల విధానం అమలులో ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి పావు మార్కులను కోత విధిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మెయిన్స్ ఎగ్జామ్‌కు ఎంపికవుతారు.
మెయిన్స్ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. ప్రశ్నల సంఖ్య మొత్తం 190. 4 విభాగాలు ఉంటాయి. జనరల్ లేదా ఫైనాన్షియల్ అవేర్‌నెస్ 50 న్రశ్నలు 50 మార్కులు, జనరల్ ఇంగ్లిస్ 40 ప్రశ్నలు 40 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 ప్రశ్నలు 50 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూట్ 50 ప్రశ్నలు 60 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం 2 గంటల 40 నిమిషాలు ఉంటుంది.