ఉదయం నిద్ర లేవగానే వేడి వేడిగా గొంతులో చాయ్ పడకపోతే కొంత మందికి ఏమీ తోచదు. బెడ్ టీ తాగి కొందరు తమ దినచర్యను ప్రారంభిస్తారు. ఇక కొందరు బ్రేక్ ఫాస్ట్ చేశాకే టీ తాగుతారు. ఆ తరువాత బయటకు గనక వెళితే రోజులో ఎక్కడైనా సరే ఒక చోట తమ ఫేవరెట్‌టీని ఆస్వాదిస్తారు. అయితే చాయ్‌లలో ఎన్నో రకాలు ఉన్నాయి. కానీ సులేమానీ చాయ్ బాగా ప్రసిద్ధి గాంచింది. దీన్ని హైదరాబాద్‌తోపాటు పలు ఇతర ప్రాంతాల్లోనూ అందిస్తారు. మరి సులేమానీ చాయ్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
సులేమానీ చాయ్ తయారీకి కావల్సిన పదార్థాలు
- నీళ్లు – ఒక కప్పు
- లవంగాలు – 4
- దాల్చిన చెక్క – ఒక చిన్న ముక్క
- యాలకులు – 3
- నిమ్మకాయ – సగం ముక్క
- టీ పొడి – అర టీస్పూన్
- పుదీనా ఆకులు – 5
- చక్కెర – 2 టీస్పూన్లు
- సోంపు – 2 టీస్పూన్లు
- కుంకుమ పువ్వు – కొద్దిగా
సులేమానీ చాయ్ తయారు చేసే విధానం
నిమ్మరసం, చక్కెర, కుంకుమ పువ్వు తప్ప మిగిలిన అన్ని పదార్థాలను వేసి మరిగించాలి. ఆ మిశ్రమం కెంపు రంగులోకి మారుతుంది. నీళ్లు తెర్ల కాగుతున్నప్పుడు అందులో చక్కెర వేయాలి. కరిగే వరకు ఉంచాలి. తరువాత స్టవ్ ఆర్పేయాలి. ఆ తరువాత నిమ్మరసం, కుంకుమ పువ్వు కలిపి దించుకోవాలి.
సులేమానీ చాయ్ తయారీలో లవంగాలకు బదులుగా మిరియాలు వాడవచ్చు. రుచి కోసం అల్లం ముక్క కూడా వేసుకోవచ్చు. ఇక కొందరు గులాబీ రేకులను కూడా వేస్తారు. దీంతో చాయ్‌కి చక్కని సువాసన వస్తుంది. ఈ చాయ్ తాగడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. హైదరాబాద్ నగరంలో బిర్యానీ హోటళ్ల వద్ద ఈ చాయ్‌ను విక్రయిస్తారు. దీన్ని పైన తెలిపిన విధంగా ఇంట్లోనూ సులభంగా తయారు చేసుకోవచ్చు.