సాధారణంగా కూతురంటే తండ్రికి ఎంతో ఇష్టం. కూతురుకి కూడా ఆ తండ్రి అంటే ఎంతో ఇష్టం ఉంటుందని చెబుతుంటారు. ఈ విధమైనటువంటి తండ్రీ కూతుర్ల మధ్య ఉన్న ప్రేమానురాగం ఈ విపత్కర సమయాలలో కూడా బయట పడుతుంది. ప్రస్తుతం ఉన్న ఈ భయంకరమైన పరిస్థితుల్లో కరోనా పాజిటివ్ అని తెలిస్తే ఆ వ్యక్తి దగ్గరకు ఎవరు వెళ్ళడానికి సాహసం చేయరు. అది సొంత వాళ్ల అయినా కూడా వాళ్ళను దూరంగా పెట్టడం చూస్తున్నాము.
కాని శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలంలో ఒక హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది.జగన్నాథ వలస పంచాయతీ కొయ్యానపేటకు చెందిన అసిరి నాయుడు(44) విజయవాడలో కూలి పనులు చేసుకుంటుండగా అతను కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. పాజిటివ్ అని తెలిసిన వెంటనే తమ కుటుంబం మొత్తం సొంతూరికి వచ్చారు. అసిరి నాయుడు కి పాజిటివ్ అని తెలియగానే అతని కుటుంబాన్ని ఊరి చివరలో ఉన్నటువంటి ఒక గుడిసెలో ఉండాలని స్థానికులు చెప్పడంతో చేసేదేమిలేక ఊరి చివర ఉన్న పూరి గుడిసెల్లో నివసిస్తున్నారు.
ఈక్రమంలోనే అసిరి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఉన్నఫలంగా నేలపై కూలిపోయాడు.తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడుతున్న అతనిని చూసి తన భార్య కూడా ధైర్యం చేసి ముందుకు వెళ్ళలేక పోయింది. కానీ తన కూతురు మాత్రం తన తండ్రి ప్రాణాలను రక్షించుకోవాలని ఎంతో ఆరాటపడింది. తన తల్లి వద్దని వారిస్తున్నా తండ్రి పై ఉన్న ప్రేమతో తండ్రి దగ్గరకు వెళ్లి అతనికి నీళ్లు తాపింది. కానీ కొన్ని సెకండ్ల వ్యవధిలోనే అసిరి నాయుడు మరణించాడు. ఈ హృదయ విదారక ఘటన అక్కడున్న వారందరిని ఎంతో కలిచివేసింది. ఇలాంటి దుస్థితి మరెవరికీ రాకూడదని అక్కడున్న వారందరూ బోరున విలపించారు.