ఇళ్లలో వంట గ్యాస్ సిలిండర్ ప్రమాదాలు అనేవి అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఆ ప్రమాదాల్లో ఒక్కోసారి కేవలం ఆస్తి నష్టం మాత్రమే సంభవిస్తుంది. కానీ కొన్ని సార్లు ప్రాణాలు పోతుంటాయి. అయితే వంట గ్యాస్ సిలిండర్‌కు అకస్మాత్తుగా మంటలు అంటుకుంటే చాలా మందికి ఏం చేయాలో తెలియదు. ఇంటి నుంచి బయటకు పారిపోతారు. కానీ ఆ పోలీస్ ఆఫీసర్ అలాంటి పరిస్థితిలో ఏం చేశాడో చూడండి.
ఉత్తరప్రదేశ్‌లోని సంభల్ జిల్లాలో ఓ ఇంట్లో వంట గ్యాస్ సిలిండర్‌కు మంటలు అంటుకున్నాయి. ఆలస్యం చేస్తే ఆ సిలిండర్ పేలి ఇల్లంతా మంటలకు దగ్ధం అయి ఉండేది. కానీ యోగేంద్ర రాఠీ అనబడే ఓ పోలీసు అధికారి అక్కడికి సమయానికి చేరుకుని ఆ సిలిండర్ నుంచి వస్తున్న మంటలను ఆర్పేశారు.
ఓ బకెట్‌లో నీటిని తీసుకుని అందులో బ్లాంకెట్‌ను ముంచి పూర్తిగా తడిపి అనంతరం దాన్ని మంటలు మండుతున్న ఆ సిలిండర్‌పై ఆయన కప్పారు. దీంతో ఒక్కసారిగా మంటలు ఆరిపోయాయి. ఆ సమయంలో ఆ దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ క్రమంలో ఆ వీడియో వైరల్‌గా మారింది. ఆ ఇంటిని మంటలకు ఆహుతి కాకుండా కాపాడారని ఆయన చూపిన సమయస్ఫూర్తికి నెటిజన్లు అందరూ ఆయనను మెచ్చుకుంటున్నారు.