సామాజిక మాధ్యమాల్లో రోజూ మనం అనేక వీడియోలు, ఫొటోలు చూస్తుంటాం. వాటిల్లో నిజమైనవి చాలా తక్కువగా ఉంటాయి. అన్నీ ఫేక్‌వే ఉంటాయి. అయినప్పటికీ కొందరు ఆకతాయిలు మాత్రం పనిగట్టుకుని మరీ తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఇక తాజాగా మరో ఫేక్ వీడియో వైరల్‌గా మారింది.
కరీంనగర్‌లోని రామడుగు మండలం వెలిచాల గ్రామం ఇందిరమ్మ కాలనీలో నీలగిరి చెట్ల మధ్య ఓ పాము సంచరిస్తుందని, అది వింతగా అరుస్తుందని ఓ వార్త వైరల్ అయింది. ఆ పాము ఇదే అంటూ ఓ వీడియో కూడా వైరల్ అయింది. అయితే అందులో నిజం లేదని తేల్చారు.
అరిచే పాము వీడియో అబద్ధమని, అందులో ఎంతమాత్రం నిజం లేదని, మైక్ మార్టిన్ అనే వ్యక్తి యూట్యూబ్‌లో పెట్టిన వీడియోను తప్పుగా వాట్సాప్‌లో ప్రచారం చేస్తున్నారని స్థానిక ఎస్సై తాండ్ర వివేక్ ఈ విషయంపై స్పష్టతను ఇచ్చారు. ఆ గ్రామానికి చెందిన ఓ యువకుడు సదరు ఆ వీడియోను, వార్తను పోస్ట్ చేశాడని, అతన్ని ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. కనుక ఆ వార్తను, వీడియోనూ ఎవరూ నమ్మకూడదని, ప్రపంచంలో ఎక్కడా అరిచే పాములు ఉండవని అన్నారు.