చికెన్ అంటే నాన్ వెజ్ ప్రియులు చాలా మందికి ఇష్టమే. చికెన్‌తో తయారు చేసే ఏ వంటకాన్ని అయినా దాదాపుగా చాలా మంది ఇష్టంగానే తింటుంటారు. ఇక కొన్ని ప్రత్యేక రెస్టారెంట్లలో చికెన్‌తో పలు ప్రత్యేక ఐటమ్‌లను తయారు చేస్తుంటారు. వాటి ధర సహజంగానే ఎక్కువగా ఉంటుంది. కానీ ఒక చోట తయారు చేసిన ఓ చికెన్ వెరైటీ డిష్ ధర మాత్రం ఏకంగా రూ.73 లక్షలు పలికింది. అవును, నిజమే. నమ్మలేరా.. అయితే ఇది చదవండి.
ప్రముఖ ఫుడ్ స్టోర్ మెక్ డొనాల్డ్ గురించి అందరికీ తెలిసిందే. అందులో చికెన్ నగ్గెట్స్ లభిస్తాయి. అవి చాలా రుచికరంగా ఉంటాయి. అయితే ఓ మెక్ డొనాల్డ్ స్టోర్ వారు చికెన్ నగ్గెట్స్‌ను ప్రత్యేకంగా తయారు చేశారు. అమాంగ్ అస్ అనే వీడియో గేమ్‌లోని క్యారెక్టర్‌ను పోలిన విధంగా చికెన్ నగ్గెట్స్‌ను తయారు చేసి విక్రయించారు. దీంతో సహజంగానే వాటికి చాలా డిమాండ్ ఏర్పడింది.
ఆ వీడియో గేమ్ ప్రియులు ఆ నగ్గెట్స్‌ను కొనేందుకు ఎంతో ఆసక్తి చూపించారు. ఈ క్రమంలో ఒక నగ్గెట్ ఏకంగా 99,997 డాలర్లకు అమ్ముడైంది. అంటే మన కరెన్సీలో అక్షరాలా రూ.73 లక్షలు అన్నమాట. ఈ నగ్గెట్‌ను ఈబే అనే సైట్‌లో వేలం పెట్టారు. దీంతో దానికి ఆ ధర వచ్చింది. దాన్ని ఊటా అనే ప్రాంతానికి చెందిన పోలిజ్నా అనే వ్యక్తి కొనడం విశేషం.