రహదారిపై వాహనంలో ప్రయాణించేటప్పుడు నియమ నిబంధనలకు అనుగుణంగా నెమ్మదిగా ప్రయాణం చేయాలి. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పూర్తి బాధ్యతాయుతంగా డ్రైవింగ్ చేయాలి. కానీ కొందరు నిర్లక్ష్యంగా వాహనాలను నడిపిస్తుంటారు. ప్రమాదాలను కొని తెచ్చుకుంటుంటారు. తమిళనాడులోనూ సరిగ్గా ఇలాగే జరిగింది. ఓ డ్రైవర్ వాహనాన్ని నిర్లక్ష్యంగా నడిపాడు. దీంతో వాహనం అదుపు తప్పి బోల్తా కొట్టింది. కానీ వారికి భూమిపై నూకలు ఇంకా బాకీ ఉన్నాయి. కనుకనే అందులో ఉన్న వారు ప్రాణాలతో బయట పడ్డారు.
తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో ఉన్న మార్తాండం బ్రిడ్జిపై ఓ మహీంద్రా జైలో వాహనం తన ముందు వెళ్తున్న ఇంకో వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తూ వెళ్లింది. ఎదురుగా వచ్చే వాహనాలను సైతం లెక్క చేయకుండా డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపించాడు. దీంతో కొద్ది దూరం వెళ్లగానే వాహనం అదుపు తప్పి పల్టీలు కొట్టింది.
అయితే ఆ వాహనం ప్రయాణిస్తున్న బ్రిడ్జికి రెండు వైపులా పిట్ట గోడలు ఉన్నాయి. కనుక వాహనం బ్రిడ్జి మీద నుంచి కిందకు పడలేదు. దీంతో అందులో ప్రయాణిస్తున్న వారు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. నిజంగా అది వారి అదృష్టమనే చెప్పవచ్చు. ఇక ఆ వాహనం వెనుకే వస్తున్న ఇంకో వాహనంలో డాష్‌బోర్డుకు అమర్చిన కెమెరాలో ఆ దృశ్యాలు రికార్డయ్యాయి. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.