భగ భగమండే లావా బయటకు వచ్చే అగ్ని పర్వతాల వద్ద ఎవరూ ఉండలేరు. ఆ వేడికి తట్టుకోలేరు. అందుకనే అగ్ని పర్వతాల సమీపంలో ప్రజలు నివాసం ఉండరు. అయితే ఓ వ్యక్తి మాత్రం అగ్ని పర్వతం నుంచి బయటకు వస్తున్న లావాను ఓ డ్రోన్ సహాయంతో చిత్రీకరించాడు. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్‌గా మారింది.
ఐస్ ల్యాండ్ రాజధాని రెయిక్‌జావిక్‌కు పశ్చిమం వైపున సుమారుగా 40 కిలోమీటర్ల దూరంలో ఫగ్రడాల్స్‌జల్ అనే అగ్ని పర్వతం ఉంది. అది మార్చి 19వ తేదీన అక్కడి కాలమానం ప్రకారం రాత్రి 8.45 గంటలకు బద్దలైంది. దీంతో లావా పైకి వచ్చి చుట్టూ ప్రవహించసాగింది. ఈ క్రమంలో ఆ ప్రాంతాన్ని నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించారు. అక్కడ ఎవరూ తిరగడం లేదు.
Seems like my video went full throttle! More on my YouTube channel pic.twitter.com/RzrRniXxPu
— Bjorn Steinbekk (@BSteinbekk) March 22, 2021
అయితే జార్న్ స్టెయిన్‌బెక్ అనే ఓ డ్రోన్ ఫొటోగ్రాఫర్ తన డ్రోన్ సహాయంతో ఆ అగ్నిపర్వతాన్ని, దాని నుంచి బయటకు వస్తున్న లావాను చక్కగా చిత్రీకరించాడు. అంత ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ అతను తన డ్రోన్ సహాయంతో చాలా చాకచక్యంగా వీడియోను చిత్రీకరించాడు. అనంతరం దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. అందులో ఎరుపు రంగులో భగ భగ మండుతూ ప్రవహిస్తున్న లావాను వీక్షించవచ్చు. అలాగే అగ్ని పర్వతం నుంచి పైకి వస్తున్న లావాను కూడా చూడవచ్చు. ఈ వీడియో ఎంతో అద్భుతంగా ఉందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.