చెన్నైలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 టోర్నీ 5వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ముంబై నిర్దేశించిన 153 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోల్‌కతా తడబడింది. ఈ క్రమంలో కోల్‌కతాపై ముంబై 10 పరుగుల తేడాతో గెలుపొందింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌట్ అయింది. ముంబై బ్యాట్స్‌మన్లలో సూర్య కుమార్ యాదవ్, రోహిత్ శర్మలు రాణించారు. 36 బంతుల్లో యాదవ్ 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 56 పరుగులు చేయగా, 32 బంతుల్లో రోహిత్ 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో 43 పరుగులు చేశాడు. కోల్‌కతా బౌలర్లలో ఆండ్రు రస్సెల్ 5 వికెట్లు పడగొట్టాడు. ప్యాట్ కమ్మిన్స్ 2 వికెట్లు తీయగా, వరుణ్ చక్రవర్తి, షకిబ్ అల్ హసన్, ప్రసిధ్ కృష్ణలకు తలా 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 142 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో నితీష్ రాణా (57 పరుగులు, 6 ఫోర్లు, 2 సిక్సర్లు), శుబమన్ గిల్ (33 పరుగులు, 5 ఫోర్లు, 1 సిక్సర్)లు మాత్రమే ఆకట్టుకున్నారు. మిగిలిన ఎవరూ రాణించలేదు. ముంబై బౌలర్లలో రాహుల్ చాహర్ 4 వికెట్లు పడగొట్టగా ట్రెంట్ బౌల్ట్ 2 వికెట్లు తీశాడు. క్రునాల్ పాండ్యాకు 1 వికెట్ దక్కింది.