సాధారణంగా మనం చిన్న పామును చూస్తేనే భయంతో ఆమడ దూరం పరిగెత్తుతాము. అలాంటిది ఒక పది అడుగుల కొండచిలువ ఒక సూపర్ మార్కెట్ లో కనపడితే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అచ్చం ఇలాంటి ఘటన ఆస్ట్రేలియాలోని సిడ్నీలో వాల్వర్త్ సూపర్ మార్కెట్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
సిడ్నీలోని వాల్వర్త్ సూపర్ మార్కెట్ లో హెలెనా అల్టీ అనే మహిళ డబ్బాల కోసం వెతుకుతుండగా ఆ మహిళకు డబ్బాల మధ్యలో నుంచి కొండచిలువ బయటకు వచ్చి కనిపించింది. ఆ కొండచిలువని చూడగానే హెలెనా ఉలిక్కిపడింది. అయితే ఆ మహిళ ఈ విషయాన్ని సదరు కస్టమర్లకు చెప్పి వారందరినీ అలర్ట్ చేసింది. ఆమె ఇలాంటి పాములను చూడటం కొత్తేమీ కాదు. ఈ క్రమంలోనే ఎంతో ధైర్యంగా ఈ సంఘటనను వీడియోగా చిత్రీకరించింది.
హెలెనా సిడ్నీ వైల్డ్‌లైఫ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీలో కొన్ని సంవత్సరాల పాటు పని చేయటం వల్ల ఎంతో చాకచక్యంగా ఆ కొండచిలువను ఒక సంచిలో వేసుకొని ఆ కొండచిలువను దగ్గరలో ఉన్న అడవిలోకి వదిలింది. ఈ క్రమంలోనే హెలెనా ఎంతో ధైర్యంతో ఆ కొండచిలువను పట్టుకోవడంతో మార్కెట్ యజమానులు, కస్టమర్లు ఎంతో ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.