దేశంలో కరోనా సెకండ్ వేవ్ సునామీలా విజృంభిస్తోంది. రోజూ 3.50 లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. మొత్తం మరణాల సంఖ్య ఇప్పటికే 2 లక్షలు దాటింది. ఈ క్రమంలో కోవిడ్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇక భారీగా పెరుగుతున్న కోవిడ్ కేసుల వల్ల వైద్య రంగం సంక్షోభంలో పడేందుకు సిద్ధంగా ఉంది. అయినప్పటికీ వైద్య సిబ్బంది కోవిడ్ బాధితులను రక్షించేందుకు రోజుకు 24 గంటలూ శ్రమిస్తున్నారు.
కోవిడ్ బాధితులకు చికిత్స ఇస్తూ కొన్ని గంటల పాటు పీపీఈ కిట్‌లో ఉండి అత్యంత దయనీయ స్థితిలో ఉన్న ఓ డాక్టర్ ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఆ డాక్టర్ పూర్తిగా తడిసిపోయి ఉండడాన్ని గమనించవచ్చు. ఆ ఫొటోలో ఉన్న వ్యక్తిని డాక్టర్ సోహిల్‌గా గుర్తించారు. ఏప్రిల్ 28 తేదీన ఆయన తన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్‌గా మారింది.
Proud to serve the nation pic.twitter.com/xwyGSax39y
— Dr_sohil (@DrSohil) April 28, 2021
పీపీఈ కిట్‌లో 15 గంటల పాటు ఉన్న తరువాత పరిస్థితి ఎలా ఉంటుందో ఆ డాక్టర్ వివరించారు. అంతటి దారుణమైన స్థితిని ఎదుర్కొంటూ కూడా కోవిడ్ బాధితులకు సేవ చేస్తున్నామని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు. కోవిడ్ వ్యాప్తి చెందకుండా ప్రజలు అన్ని రకాల జాగ్రత్తలను పాటించాలని, కోవిడ్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలంటే టీకా ఒక్కటే మార్గమని, ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని అన్నారు. కాగా ఆ డాక్టర్ పెట్టిన పోస్టుకు నెటిజన్లు స్పందిస్తున్నారు. తాము కోవిడ్ వారియర్లకు మద్దతుగా ఉంటామని తెలిపారు.