దేశంలో కరోనా విజృంభిస్తోంది. రోజుకు 3.50 లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో మరిన్ని కఠిన ఆంక్షలు విధించాలని, కోవిడ్ కట్టడికి చర్యలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే కరోనా సెకండ్ వేవ్ మరీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే సుప్రీం కోర్టు ఈ విషయంపై కేంద్రాన్ని ప్రశ్నించింది. కోవిడ్ కట్టడికి ఏం చర్యలు తీసుకుంటున్నారని ఇటీవల అడిగింది. అందుకు కేంద్రం సమాధానం చెప్పింది. కానీ పరిస్థితి చేయి దాటినట్లు కనిపిస్తుండడంతో మోదీ కేంద్ర మంత్రులతో కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు.
ప్రధాని మోదీ శుక్రవారం కేంద్ర కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో కేంద్ర మంత్రులు పాల్గొననున్నారు. దేశంలో కోవిడ్ పరిస్థితి, కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై వారు చర్చించనున్నారు. అయితే ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కోవిడ్ విజృంభిస్తుండడంతో కేంద్రం ముందు లాక్‌డౌన్ ఒక్కటే మార్గంగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రధాని మోదీ తాజాగా నిర్వహించిన మన్‌కీబాత్‌లో లాక్‌డౌన్ అనేది చివరి అస్త్రమని తెలిపారు. కోవిడ్ కేసుల సంఖ్య భారీగా నమోదవుతుండడంతో ఇక చివరి అస్త్రాన్ని ప్రయోగించడం ఒక్కటే మార్గమని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే లాక్‌డౌన్ ఉండదని పలువురు కేంద్ర మంత్రులు ఇప్పటికే పలుమార్లు చెప్పారు. అయినప్పటికీ పరిస్థితి చేయి దాటింది కనుక ఇక లాక్‌డౌన్ పెట్టడం తప్ప ఇంకో మార్గం లేదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మోదీ నిర్వహించనున్న ఈ సమావేశంలో లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకుంటారా, లేదా కఠిన ఆంక్షలను అమలు చేయాలని రాష్ట్రాలకు చెబుతారా ? అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.