భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీకి దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలోనే మోడీపై ఉన్న అభిమానంతో పూణె ప్రాంతానికి చెందిన బీజేపీ కార్యకర్త మయూర్ మొండే ఆయనకు గుడి కట్టించడమేకాకుండా ఆ గుడిలో మోడీ విగ్రహాన్ని ప్రతిష్టించాడు. ఈ విధంగా మోడీకి కట్టించిన ఆలయాన్ని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రారంభించారు.
కాగా ఆలయంలో ప్రతిష్టించిన మోడీ విగ్రహాన్ని రెండు రోజులు కూడా గడవకముందే రాత్రికి రాత్రి చోరీ చేశారు. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విగ్రహాన్ని ప్రతిష్టించడం పట్ల పట్ల ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు కొందరి నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినట్లు తెలుస్తోంది. అయితే విగ్రహం ప్రతిష్టించిన 72 గంటలు కూడా కాకముందే ఈ విగ్రహం చోరీకి గురవడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ విగ్రహాన్ని ప్రతిష్టించిన మయూర్ స్పందన కోసం ప్రయత్నించినప్పటికీ అతని ఫోన్ స్విచాఫ్ వస్తుండడం గమనార్హం. అయితే ఈ విగ్రహం ఏర్పాటు చేయడంతో ప్రధానమంత్రి కార్యాలయం నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతోనే ఈ విగ్రహాన్ని తొలగించారని ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ విగ్రహం ఏర్పాటు చేసే సమయంలో మయూర్ ఇంధనం ధరలు తగ్గుతాయని, ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షల డబ్బులు జమ అవుతాయని చెప్పడం పలు విమర్శలకు కారణమయింది. ఏది ఏమైనప్పటికీ ప్రధానమంత్రి నరేంద్రమోడీ విగ్రహాన్ని దొంగతనం చేసినట్లు తెలియడంతో ఈ విషయం హాట్ టాపిక్ అవుతోంది.